Idream media
Idream media
రెండు, మూడు నెలలకు ఒకే సారి రీడింగ్ తీయడంతో కరెంట్ బిల్లుల మోత ఎలాగున్నా.. ప్రతి పక్షాలకు మాత్రం పని దొరికినట్లయింది..! తెలుగు రాష్ట్రాలు రెండు చోట్లా… దాన్నో అవకాశంగా చేసుకుని రోడ్డెక్కే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. ఆంధ్రప్రదేశ్ లో అయితే.. టీడీపీ నేతలు ఒకడుగు ముందుకేసి బిల్లులు పెంచేశారు.. బాదేశారు.. అంటూ గందరగోళానికి గురి చేసి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.
గత నెలలో ప్రజలకు విద్యుత్ బిల్లులు అందినకాడ నుంచీ హడావిడి మొదలుపెట్టారు. అయితే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి పెద్దగా స్పందన రాకపోగా.. సీఎం జగన్ చేపట్టిన చర్యలతో కిమ్మనకుండా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జూన్ 30 వరకు ప్రజల నుంచి విద్యుత్ బిల్లులు వసూళ్లు చేయొద్దని పంపిణీ సంస్థలను జగన్ ఆదేశించారు. దీంతో ప్రజలకు మరికొంత రిలీఫ్ ఇచ్చినట్లయింది. ప్రతిపక్షాలకు చెక్ పడింది.
ఇక తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలలో విద్యుత్ సిబ్బంది మీటర్ రీడింగ్ తీయలేదు. జూన్ 2 నుంచి ఇంటింటికి వెళ్లి సిబ్బంది రీడింగ్ తీసి విద్యుత్ బిల్లులను వినియోగదారులకు అందజేస్తున్నారు. ఇక్కడ కూడా మూడు నెలలకు కలిపి రీడింగ్ తీయడం.. లాక్ డౌన్ తో అందరూ ఇంట్లోనే ఉండడంతో వాడకం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యుత్ బిల్లుల రుసుం ఎక్కువగా వచ్చాయి. ఇదే అదునుగా ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ రంగంలోకి దిగింది. అక్కడ టీడీపీ అందుకున్న పాటే.. ఇక్కడ కాంగ్రెస్ కూడా అందుకుంది. విద్యుత్ బిల్లులు పెంచేశారు.. పెంచేశారు.. అంటూ ఆందోళన చేస్తున్నారు. గురువారం చలో సచివాలయానికి పిలుపు ఇచ్చి కాస్త హడావిడి చేశారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటి రెడ్డి వెంకట రెడ్డి, రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధం చేశారు. సీనియర్ నేతలు వి. హనుమంత రావు, శ్రీధర్ బాబులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. మరో వైపు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా బిల్లులు తగ్గించాలని, రద్దు చేయాలంటూ ప్రకటనలు విడుదల చేస్తున్నారు.
ఒక రకంగా కొన్ని చోట్ల విద్యుత్ శాఖ పొరపొట్లు కూడా ప్రతిపక్షాల ఆందోళనకు ఊతమిచ్చాయి. రీడింగ్ తీయడంలో తప్పుల కారణంగా కొందరికి లక్షల రూపాయల్లో విద్యుత్ బిల్లులు వచ్చాయి. నల్లగొండ పట్టణంలో సర్వీసు 4010244714 రెండు రేకుల ఇంటికి 19,19,267 బిల్లు వేశారు. అలాగే.. కామారెడ్డి లోని ఇస్రోజి వాడలోని 3 బల్బులు, 2 ఫ్యాన్లు వాడే ఇంటికి 7.29 లక్షల రూపాయల బిల్లు వేశారు. అలాంటి వాటిని వెంటనే సరిదిద్దుతామని సీఎండీ రఘమారెడ్డి ప్రకటన ఇచ్చారు. బిల్లలుపై అనుమానాల నివృత్తికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు నెలల బిల్లు ఒకేసారి చెల్లించ లేని వారు వాయిదాల పద్ధతిన కట్టవచ్చని సూచించారు.