Idream media
Idream media
ప్రచారాన్ని ప్రారంభించిన రాజకీయ పార్టీలు-నేడు అమిత్ షా డిజిటల్ ర్యాలీ
బీహార్‌లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఆ రాష్ట్రంలో ఎన్నికల సమరం ప్రారంభమైంది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు తమ తమ ఎన్నికల వ్యూహలతో ముందుకు వెళ్తున్నారు. బిజెపి తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిజిటల్ ర్యాలీ నిర్వహించనున్నారు. దీంతో రాజకీయ నాయకుల్లో ఆత్రుత మొదలైంది.
ఎన్నికలు దగ్గరపడుతుండడంతో జెడియు అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో కలిసి మల్లీ పీఠాన్ని అధిరోహించాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీయే ప్రభుత్వమే బిహర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ఎల్‌జెఎస్‌పి నేత, కేంద్ర మంత్రి రాం విలాశ్ పాశ్వాన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు అధికార పక్షం వ్యతిరేకత మూటగట్టుకుంది. జెడియు, బిజెపి, ఎల్‌జెఎస్‌పి పార్టీలు కలిసి కూటమిగా ఎన్నికల రణరంగంలోకి వెళ్లనున్నాయి.
బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించేందుకు బిజెపి సిద్ధమైంది. రాష్ట్ర ప్రజలనుద్దేశించి కేంద్ర మంత్రి, పార్టీ సీనియర్ నేత అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్, ఫేస్ బుక్ లైవ్ ద్వారా ప్రసంగించనున్నట్లు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి 243 అసెంబ్లీ స్థానాల్లోని లక్ష మంది ప్రజలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. బిహార్‌లో మొదటి నుంచి బిజెపికి వెన్ను దన్నుగా నిలుస్తున్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెఎస్‌పి )ఈసారి కూడా కూటమిగా బరిలోకి దిగుతామంటోంది. దళిత వర్గంలో ఈ పార్టీకి పట్టుంది. దళిత ఓటు బ్యాంకును తమవైపు మలుచుకునేందుకు ఎల్‌జెఎస్‌పిను బిజెపి వాడుకుంటుందని ఆరోపణలు కూడా ఉన్నాయి.
వలస కూలీల విషయంలో నితీష్ పనితీరుపై బాహటంగానే పాశ్వాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 225కు పైగా సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలో కూర్చుంటామని ఎల్‌జెఎస్‌పి నేతలు ధీమాగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షా చేపడుతున్న డిజిటల్ ర్యాలీ ఎన్డీఏ ఐక్యతను చాటి చెప్పేందుకేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు బీహార్‌లో అమిత్ షా నిర్వహించనున్న వర్చువల్ ర్యాలీపై ఆర్జేడి నేత తేజస్వీయాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశం మొత్తం కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంటే బిజెపి ఎన్నికల కోసం తాపత్రయపడుతుండడం, రాజకీయ రాబందువాదమేనని అన్నారు. జనం చనిపోతున్నా బిజెపికి పట్టడంలేదని, దానికి కావాల్సింది ఎన్నికల్లో విజయం సాధించడమేనని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని 15 ఏళ్ల విభజిత, విఫల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకే భావజాలం కలిగిన పేదల అనుకూల పార్టీలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందన్నారు.
గత ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడియు, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఎన్నికల బరిలో నిలిచాయి. బిజెపి, ఎల్‌జెఎస్‌పి, ఆర్ఎల్‌పి పార్టీలు కూటమిగా వెళ్లాయి. ఆ ఎన్నికల్లో జెడియు, ఆర్జేడి, కాంగ్రెస్‌ల నేతృత్వంలోని మహా కుటమి ఘన విజయం సాధించింది. నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్ని రెచ్చగొట్టిన బిజెపి కూటమికి ఓటమి తప్పలేదు. ఒకనొక సమయంలో అమిత్ షా మహాకుటమి గెలిస్తే పాకిస్తాన్‌లో టపాసులు పేలుతాయంటూ రెచ్చగెట్టే వ్యాఖ్యలు చేసిన ఫలితం లేకపోయింది. అయితే తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎల్‌పి, ఎన్‌డిఎ నుంచి బయటకు వచ్చింది. మహాకుటమి నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ ఎన్‌డిఎలో చేరారు.
ఈ ఎన్నికల్లో జెడియు, బిజెపి, ఎల్‌జెఎస్‌ఫి కూటమిగా పోటీ చేయనున్నాయి. మరోవైపు ఆర్జేడి, కాంగ్రెస్, జితిన్ రామ్ మాంఝీ నేతృత్వంలో హెచ్ఎఎం, ఆర్ఎల్‌పి కూటమిగా పోటీ చేయనున్నాయి.