ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం.. కీలక నిర్ణయాలుంటాయా..?

ప్రధాని నరేంద్ర మోదీ మరో సారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ రోజు గురువారం సమావేశం కాబోతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ, లాక్‌డౌన్‌ అమలుపై ప్రధాని మోదీ సీఎంలతో చర్చించనున్నారని సమాచారం. లాక్‌డౌన్‌తో దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఆగినట్లు కనిపించినా.. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ జమాత్‌ ఘటనతో పరిస్థితి ఒక్కసారిగా ఆందోళనగా మారింది.

రెండు రోజుల నుంచి దేశంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అవుతుండడం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. జమాత్‌ నుంచి కరోనా వైరస్‌ దేశం నలుమూలలా వ్యాపించిందని ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ నిర్థారించింది. సదరు సదస్సు జరిగి 17 రోజులు కావస్తుండగా.. రెండు, మూడు రోజుల క్రితం అక్కడికి వెళ్లి వచ్చిన వారికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. మార్చి 16 నుంచి 31వ తేదీ వరకూ మధ్యలో 15 రోజుల పాటు వారు తమ ప్రాంతాల్లో సంచరించి ఉంటారు. తమ వృత్తులు, పనుల్లో భాగంగా పలువురిని కలిసి ఉంటారు. ఇలాంటి పరిస్థితిలో వైరస్‌ ఇంకా ఎంత మందికి, ఎన్ని ప్రాంతాలకు వ్యాపించి ఉంటుందనేది సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది.

తాజాగా పరిస్థితిని నియంత్రించేందుకు ప్రధాని మోదీ సీఎంలకు ముఖ్యమైన సూచనలు చేసే అవకాశం ఉంది. గత నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ విధించముందు కూడా ప్రధాని ఇలాగే సీఎంలతో సమావేశం అయ్యారు. ఆ తర్వాతనే జనతా కర్ఫ్యూ, ఆ మరుసటి రోజునే దేశం మొత్తం లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజా సమావేశం తర్వాత వైరస్‌ వ్యాప్తికి మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Show comments