లాక్‌డౌన్‌ను లెక్కచేయని జనం.. క్లాస్‌ పీకేందుకు సిద్ధమైన ప్రధాని మోదీ..

కరోనా వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వేళ దేశం లాక్‌ డౌన్‌ అయింది. దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాలు, 30 రాష్ట్రాలు అన్ని లాక్‌ డౌన్‌ అయ్యాయి. ఈ నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ తర్వాత మరుసటి రోజునే దేశంలోని ప్రధాన రాష్ట్రాలు లాక్‌ డౌన్‌ అవుతున్నట్లు ప్రకటించగా.. తాజాగా ఆ జాబితాలోకి అన్ని రాష్ట్రాలు చేరిపోయయి.

పలు రాష్ట్రాలు తమకు తాము లాక్‌డౌన్‌ ప్రకటించుకోగా.. కరోనా వైరస్‌ ప్రభావం ఉన్న 85 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మొదటి రోజైన సోమవారం ప్రజలు లాక్‌డౌన్‌ను లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చారు. దీనిపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన దేశ ప్రజలు లాక్‌డౌన్‌ను మాత్రం పట్టించుకోలేదు.

ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రపంచాన్ని చుట్టేసింది. మూడు నెలల క్రితం చైనాలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మరి ప్రస్తుతం 195 దేశాలకు వ్యాపించింది. యూరప్‌తో సహా దక్షిణ అమెరికా, పశ్చిమాసియా దేశాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. అభివృద్ధి చెందిన ఇటలీ లాంటి దేశాలు కరోనాను కంట్రోల్‌ చేయలేక తలలుపట్టుకుంటున్నాయి. కరోనా ప్రభావం ఇలా ఉండగా.. దేశంలో ఆదిలోనే కరోనాను కంట్రోల్‌ చేసేందుకు లాక్‌డౌన్‌ను ప్రకటించారు. అయితే దేశ ప్రజలు లైట్‌ తీసుకోవడంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్ధేశించి ప్రసంగించేందుకు ఈ రోజు మీడియా ముందుకు వస్తున్నారు.

కరోనా వైరస్‌ వల్ల జరిగే నష్టం ఏమిటో చెబుతూ ప్రజలను మరింత అప్రమత్తం చేసే దిశగా ప్రధాని ప్రసంగించే అవకాశం ఉంది. ప్రజలను లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకుని ఇళ్లకే పరిమితం అయ్యేలా అప్రమత్తం చేసేందుకు మోదీ సిద్ధమైనట్లు నిన్న ఆయన చేసిన ట్వీట్‌ను బట్టి అంచనా వేయొచ్చు. ప్రస్తుతం భారత్‌ కరోనా రెండో దశలో ఉంది. ఇక్కడతో దీన్ని కంట్రోల్‌ చేస్తే.. ఈ మహమ్మరి నుంచి దేశం బయటపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Show comments