Idream media
Idream media
కరోనా కట్టడికి దేశంలో 70 రోజుల నుంచి కొనసాగుతున్న లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బిజెపి ప్రభుత్వం లక్ష్యంగా మాటల తూటాలు ఎక్కుపెట్టారు. కరోనా వైరస్ గణాంకాల వెల్లడించి మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎండగట్టారు. లాక్‌డౌన్ అమలు నుంచి అన్‌లాక్ మొదటి దశ వరకు.. అంటే మార్చి 20 నుంచి మే 31 మధ్య కరోనా మహమ్మారి పరిస్థితిని గణాంకాలతో సహా ఆయన ట్వీట్ చేశారు. ‘‘లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది మొదలు ఉపసంహరణ మొదటి దశ వరకు భారత్‌లో కోవిడ్-19 కేసుల లెక్క ఇదీ.. దీన్ని కూడా గుర్తుంచుకోండి మరి..’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
లాక్‌డౌన్ అమలుకు ముందు దేశంలో 190 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 1002 రెట్లు పెరిగి 1.90 లక్షలకు చేరుకుందని పీకే పేర్కొన్నారు. కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఇప్పుడు 7 స్థానంలోకి చేరిందని ఆయన తెలిపారు. కరోనా మరణాలు సైతం 1,348 రెట్లు పెరిగి 5394కు చేరిందని పీకే గుర్తుచేశారు. దీంతో ఈ ప్రాణాంతక మహమ్మారి కారణంగా అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారత్ 13వ స్థానానికి చేరుకుందన్నారు.
లాక్‌డౌన్‌కి ముందు రోజువారీ కేసులు సరాసరిన వారానికి 16 వరకు ఉండగా.. ఇప్పుడు ఏకంగా 464 రెట్లు పెరిగి 7384కు చేరిందన్నారు. కరోనా ప్రభావిత జిల్లాల సంఖ్య 68 నుంచి 634కు పెరిగింది. రోజూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న జీ-20 దేశాల్లో రష్యా (11.33 శాతం) మొదటి స్థానంలో ఉండగా.. 10.21 శాతంతో భారత్ రెండో స్థానంలో ఉంది. మరణాల పెరుగుదల విషయానికొస్తే 10.84 శాతంతో భారత్ నాలుగో స్థానంలో ఉంది. భారత్‌కు ముందు మెక్సికో (13.13 శాతం), రష్యా (13.11 శాతం), బ్రెజిల్ (12.90 శాతం) మాత్రమే ఉన్నాయని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ఈ విషయాలు వెల్లడించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో ఎలా పని చేసింది పీకే చెప్పారు.
Read Also : నిప్పులేనప్పుడు నీళ్లు.. ప్రజలకు కన్నీళ్లు..