iDreamPost
android-app
ios-app

సంక్షేమ లక్ష్య చేదనలో చికాకులు లెక్కచేయని జగన్ ..

  • Published May 25, 2020 | 6:25 AM Updated Updated May 25, 2020 | 6:25 AM
సంక్షేమ లక్ష్య చేదనలో చికాకులు లెక్కచేయని జగన్ ..

గత ఏడాది వైసీపీ గెలిచిన నాటి నుండీ టీడీపీ పార్టీ జగన్ పై పలు ఆరోపణలతో దాడి చేస్తుండగా టీడీపీ అనుబంధ సంస్ధలు , మరో వైపు జనసేన పవన్ , అడపాదడపా బీజేపీ కన్నా , సీపీఐ రామకృష్ణ వంటి వారు సైతం టీడీపీ ఆరోపణలు అందిపుచ్చుకోవడం చేయసాగాయి . కాలక్రమంలో ఈ ఆరోపణలలో పలు ఆరోపణలు అసత్యం అని తేలుతూ వస్తున్న కొద్దీ విపక్షాలు మరిన్ని కొత్త ఆరోపణలతో దాడిని తీవ్రతరం చేస్తూ వచ్చాయి . సదరు ఆరోపణలలో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా వాటిని జగన్ ఏ మేరకు పట్టించుకొంటున్నాడు అని చూస్తే ఈషన్మాత్రం కూడా లెక్కచేయకపోగా అసలు వీటి పై దృష్టి కూడా పెట్టట్లేదు అని చెప్పొచ్చు .

పార్థా చెట్టు పై నీకేమి కనపడుతున్నాయి ఆకులా , కొమ్మలా , పూతా , కాయలా అని అడిగిన ద్రోణునికి… ఇవేమీ కనపడట్లేదు నిర్ధేశిత లక్ష్యమైన పక్షి కన్ను మాత్రమే కనపడుతుందన్న అర్జునుడిలా తన ప్రధాన హామీలైన నవరత్నాల అమలు , పరిపాలన సౌలభ్యం కోసం , ప్రభుత్వ పథకాల లబ్ది అర్హులందరికీ చేరడం కోసం తనదైన మార్క్ తో విలేజ్ వలంటీర్ , గ్రామ సచివాలయాలు , రైతు భరోసా కేంద్రాలు లాంటి నూతన వ్యవస్థలు ఏర్పాటు చేసుకొంటూ ముందుకు సాగుతున్న జగన్ ని చూస్తే మరో ఆలోచన లేకుండా శ్రద్దగా తన భూమిలో వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతులా కనిపించక మానడు .

యాడాది మొత్తంలో విపక్షాలు వందలకొద్దీ ఆరోపణలు చేసినా జగన్ ఒక్కసారి తప్ప మిగతసార్లు స్పందించినట్టు కనపడలేదు . అది కూడా తన పై కుల మత విద్వేషాలతో కూడిన ఆరోపణలకు సమాధానంగా తన కులం మానవకులం అని తన మతం మానవత్వం అని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పని చేయటమే తప్ప ఇలాంటి ఆరోపణలకు తాను బాధపడనని స్పష్టత ఇచ్చాడు తప్ప ఇతరత్రా స్పందించలేదు .

ఈ క్రమంలో ఎవరెన్ని ఆరోపణలు చేసినా లెక్కపెట్టకుండా జగన్ ముందుకు దూసుకుపోతుండగా , ప్రజా సమస్యల పట్ల విధాన పరమైన విమర్శలు చేయాల్సిన ప్రతిపక్షాలు అసత్య వార్తలతో అసంబద్ధ ప్రచారాలు చేయటం లక్ష్యంగా పెట్టుకొని దాడి చేస్తుండగా , దీన్ని జగన్ , వైసీపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోయినా వైసీపీ సోషల్ మీడియా నిజానిజాలు వెలికితీసి సమర్ధంగా తిప్పి కొట్టడం విశేషం .

ఏదేమైనా చెడు వినకు , చెడు చూడకు , చెడు మాట్లాడకు అన్న గాంధీ సూక్తిని అనుసరిస్తూ మౌన మునిలా తన పని తాను చేసుకుపోతున్న జగన్ స్థితప్రజ్ఞతను చూస్తే ఆశ్చర్యం వేయకమానదు . పరిపాలనా భాద్యతలు చేపట్టాక తన కోపం నరం తెగిపోయిందన్న తండ్రి రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొన్నాడేమో .