Idream media
Idream media
విశాఖ సమీపంలో ఉన్నఆర్ ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విష వాయువు లీకై దాదాపు నెల రోజులు కావస్తున్నా.. ఆ విషవాయువు స్థానిక ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా అనంతరం కొద్ది రోజులకు ఒకరు తాజాగా ఈ రోజు మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
ఈ రోజు యలమంచలి కనకరాజు అనే వ్యక్తి అకస్మాత్తుగా మరణించారు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు రోజుల పాటు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స తీసుకున్న కనకరాజు ఆ తర్వాత కోలుకుని ఇంటికి వెళ్లారు. అయితే ఈ రోజు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థకు గురైన కనకరాజు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో విష వాయువు సై్టరిన్ ప్రభావానికి లోనైన కంపెనీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు.
స్టైరిన్ ప్రభావం భవిష్యత్‌లోనూ ప్రభావం చూపిస్తుందన్న నిపుణుల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. పరిహారం, వైద్యం అందించడంతోపాటు వారికి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేసింది. భవిష్యత్‌లో ఏమైనా అనారోగ్య పరిస్థితులు తలెత్తితే తక్షణమే వైద్యం అందేలా ఆర్ ఆర్.వెంకటాపురంలో 20 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. మెరుగైన వైద్యం అవసరమయినా ఉచిత వైద్యం అందించేలా ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా హెల్త్ కార్టులు జారీ చేసింది. వైద్య నిపుణులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
కాగా. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ మరికొద్ది రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ప్రకారం బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్జీటీ ఏర్పాటు చేసిన జస్టిస్ శేషశయనారెడ్డి కమిటీ నివేదిక ఇచ్చింది. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సహా రాజ్యాంగబద్ధమైన సంస్థల మొత్తం ఏడు కమిటీలను విచారణ కోసం నియమించాయి. కమిటీ నివేదికలు కంపెనీని తరలించాలని సూచించినా ఈ మేరకు మరో చోటకు కంపెనీని తరలిస్తామని సీఎం జగన్ బాధితులకు ఇప్పటికే భరోసా ఇచ్చారు.