iDreamPost
android-app
ios-app

పాత పంథాలో పవన్‌..!

పాత పంథాలో పవన్‌..!

సొంత ఆలోచనలు, విధానాలతో రాజకీయాలు చేసి పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్నట్లు కనిపించడంలేదు. 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టిన పవన్‌ కళ్యాన్‌ అప్పటి నుంచి టీడీపీ బాటలోనే నడుస్తున్నారు. 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తున్నట్లు కనిపించినా.. వాస్తవ పరిస్థితి మునుపటిలాగే ఉంది. దాని ఫలితం ఎన్నికల రిజల్ట్‌లో చూశారు. ఎన్నికల తర్వాత టీడీపీకి దూరం అయి పవన్‌ కళ్యాణ్‌ బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ ఆయన పనితీరు మాత్రం మునుపటిలాగే ఉంటోంది.

టీడీపీ ఏ విమర్శలు చేస్తే ఆ విమర్శలనే జనసేనాని కూడా చేస్తూ పార్ట్‌టైం రాజకీయాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో కూర్చుకుని పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వం, ప్రభుత్వ పథకాలపై టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు చూసి వాటినే పవన్‌ కళ్యాణ్‌ ప్రభుత్వంపై చేస్తూ తూ తూ మంత్రంగా రాజకీయం చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్‌ నేతన్న హస్తం పథకంపై రోజు వ్యవధిలో టీడీపీ చేసిన విమర్శలనే పవన్‌ కళ్యాణ్‌ కూడా చేయడం ఆయన రాజకీయాలు ఎలా చేస్తున్నారో తెలియజేస్తోంది. చేనేతలు 3.50 లక్షల మంది ఉన్నారని, కానీ ప్రభుత్వం వైఎస్సార్‌ నేతన్న హస్తం 81 వేల మందికే ఇస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప విమర్శలు చేశారు. ఆ విమర్శలనే పవన్‌ కూడా చేస్తున్నారు. అయితే ఓకే సంఖ్య చెబితే బాగోదని భావించారేమో గానీ రాష్ట్రంలో 2.80 లక్షల మంది చేనేతలు ఉంటే ప్రభుత్వం 81,240 మందికే వైఎస్సార్‌ నేతన్న హస్తం పథకం ఇస్తున్నారంటూ విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలని పవన్‌ కళ్యాన్‌ డిమాండ్‌ చేశారు.

అర్హతే ఆధారంగా వైసీపీ ప్రభుత్వం పథకాలను అందిస్తోంది. ఎవరి ప్రమేయం, సిఫార్సులు లేకుండా వాలంటీర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించి, అర్హత పరిశీలించి గ్రామ సచివాలయల నుంచి పథకాలు అందిస్తున్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తూ అనర్హులు ఉంటే తెలియజేయాలని ప్రజలను కోరుతున్నారు. అర్హత ఉండి లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఆ పై పథకం అమలు చేస్తున్నారు. ఇంత పక్కాగా, పకడ్భందీగా వైసీపీ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోంది. విమర్శలు చేసేందుకు ఏ అంశం దొరక్క టీడీపీ నానా పాట్లు పడుతోంది. అదే దారిలో జనసేన కూడా నడుస్తూ పూర్వ రాజకీయాలనే చేస్తోంది.

గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం, ఆ పార్టీ అధినేత వయస్సు రీత్యా.. ఆ పార్టీ భవిష్యత్‌పై నేతల్లో అనేక అనుమానాలు, అభద్రతాభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో వారు తమ దారి తాము చూసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. భవిష్యత్‌లో వైఎస్‌ జగన్‌తో పోటీ పడే నాయకుడు టీడీపీ ప్రస్తుతం లేరనే చెప్పాలి. ఈ క్రమంలో పవన్ సరైన దిశగా రాజకీయాలు చేస్తే జగన్‌కు కొద్గో గొప్పో ప్రత్యామ్నాయం కావచ్చు. బీజేపీ ఆ దిశగానే రాజకీయాలు చేసేందుకు యత్నిస్తోంది. కానీ ఆ పార్టీకి రాష్ట్రంలో మాస్‌ లీడర్‌ అంటూ ఒక్కరూ లేరు. ఆ పార్టీ సభ పెడితే జనాలను తరలించాల్సి ఉంటుంది. కానీ పవన్‌ కళ్యాన్‌ సభ పెడితే ప్రజలను తరలించే పరిస్థితి ఉండదు. ఆయన అభిమానులు విరివిగా వస్తారు. తమ అభిమాన నేతను ఫుల్‌ టైం రాజకీయ నాయకుడిగా, చట్టసభల్లో ప్రతినిధిగా చూడాలని పవన్‌ అభిమానులు ఆశిస్తున్నారు. కానీ వారి ఆశలకు, అంచనాలకు పూర్తి విరుద్ధంగా పవన్‌ కళ్యాన్‌ రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అభిమానుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పవన్‌ ఎప్పుడు రాజకీయాలు చేస్తారో కాలమే చెప్పాలి.