iDreamPost
iDreamPost
చిన్న ఫ్లాష్ బ్యాక్
20 ఏళ్ళ కిందట, 2000 సంవత్సరంలో
నిర్మాత ఏఎం రత్నం చాలా ధీమాగా ఉన్నారు. దానికి కారణం లేకపోలేదు. అదే ఏడాది విజయ్, జ్యోతిక జంటగా తమిళ్ లో తీసిన ఖుషి కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. లాభాలు, బయ్యర్స్ లో బ్రాండ్ వేల్యూ అమాంతం రెట్టింపయ్యాయి. ఖుషిని ఒరిజినల్ కన్నా మెరుగ్గా తీయాలని నిర్ణయించుకున్నారు. ఆయన మనసులో పవన్ కళ్యాణ్ పేరు తప్ప మరొకటి లేదు. ఆ ఒక్క కారణం వల్లే ఎస్ జె సూర్య తనకు రాని భాషలో రీమేక్ కు రెడీ అన్నారు. అప్పటికే తొలిప్రేమ, సుస్వాగతం సినిమాలతో పవన్ కు అభిమానుల నుంచే కాక యూత్ లో చాలా క్రేజ్ వచ్చింది. ఖుషికి పవన్ కన్నా బెస్ట్ ఆప్షన్ దర్శక నిర్మాతలకు ఇంకెవరు కనిపించలేదు. అప్పటికే వరసగా ఐదు హిట్లతో పవన్ డిమాండ్ మాములుగా లేదు. గోకులంలో సీత మొదలుకుని బద్రి దాకా అన్ని హండ్రెడ్ డేస్ మూవీసే. మినిమమ్ గ్యారెంటీ స్టేజి నుంచి ప్రాఫిట్ ష్యుర్ హీరోగా మారాడు పవన్.
నిజానికి ఖుషి తమిళ్ వెర్షన్ రిలీజ్ కంటే ముందే పవన్ తో సినిమా మొదలుపెట్టారు రత్నం. 1999 డిసెంబర్ 31 చెప్పాలని ఉంది పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ స్టార్టయ్యింది . మొదటి షాట్ గా తీసింది ఇంటర్వెల్ లో వచ్చే నడుము సీనే. ఆ తర్వాత కొన్ని పోస్టర్లు కూడా వదిలారు. కాని బయటికి రాని కారణాల వల్ల అది అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆలోగా విజయ్ ఖుషి తమిళ్ లో రిలీజైపోవడం అక్కడ పెద్ద హిట్ కావడం చకచక జరిగిపోయాయి. కొంత గ్యాప్ తర్వాత బద్రి షూటింగ్ టైంలో పవన్ తన దగ్గరకు ఏఎం రత్నం ఖుషి రీమేక్ ప్రతిపాదన తీసుకురాగానే ఎక్కువ ఆలస్యం చేయకుండా స్పెషల్ షో వేసుకుని మరీ చూశారు. పిచ్చపిచ్చగా నచ్చింది. విజయ్ ని ఇమిటేట్ చేయకూడదు. తన స్టైల్ లోనే సిద్దు పాత్ర ఉండాలి. ప్రతి కాలేజీ స్టూడెంట్ తనలోనే వాడిని చూసుకోవాలి. అప్పుడే ఇది హిట్టవుతుంది. ఏ మాత్రం తేడా వచ్చినా నిర్మాతకు తమిళ్ లో వచ్చిన డబ్బులు తెలుగులో పోవడం ఖాయం. ఎందుకంటే బడ్జెట్ అప్పటికే భారీగా డిసైడ్ అయిపోయింది.
టీమ్ సెట్టింగ్
క్యూట్ బ్యూటీగా ఫుల్ ఫామ్ లో ఉన్న భూమిక హీరొయిన్ గా ఓకే అయ్యింది. సంగీత దర్శకుడిగా పీక్స్ లో ఉన్న మణిశర్మను తీసుకున్నారు. చిరంజీవికి ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఇచ్చిన మణి పవన్ కు సైతం తిరుగులేని ఆడియో ఇవ్వాలని అప్పటికే నిర్ణయం జరిగిపోయింది. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకులు పిసి శ్రీరామ్ ను తెచ్చేసరికి ఖుషి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఒక లవ్ స్టోరీకి ఇలాంటి సెటపా, రత్నం చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్తున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. పవన్ అప్పటికే రెండు రీమేక్ హిట్స్ అందుకున్నప్పటికీ వాటి ఖర్చు చాలా తక్కువ. కానీ ఖుషి పేపర్ మీదే భయపెట్టే రేంజ్ లో డబ్బుని డిమాండ్ చేస్తోంది. అయినా చరిత్ర తిరగరాయాలంటే ధైర్యం చేయక తప్పదనే రత్నం సంకల్పం కార్యరూపం దాల్చింది పక్కా ప్లానింగ్ తో ఆలస్యం లేకుండా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. దీని తాలూకు అప్ డేట్స్ తెలుసుకుని మీడియా వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. ఇంత ఫాస్ట్ గా పవన్ లాంటి హీరోతో ఖుషిని పూర్తి చేయడం గురించి అంతా మాట్లాడుకున్నారు.
తొలి సంచలనం
మంచి ముహూర్తం చూసుకుని ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో క్యాసెట్లు, సిడిలు విడుదల చేశారు. వీటిని అమ్మే షాపుల దగ్గర జాతర మొదలయ్యింది. విపరీతమైన అమ్మకాలు. రిపీట్ ఆర్డర్లతో ఆదిత్య యాజమాన్యం ఉక్కిరిబిక్కిరవుతోంది. పెట్టుబడి వారంలోపే వచ్చేసింది. ఇకపై వచ్చేవన్నీ లాభాలే. ఈ పరిణామాలు రిలీజ్ కు ముందు ఖుషి మీద అంచనాలను అంతకంతా పెంచేస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్ల నుంచి రత్నంపై తీవ్ర ఒత్తిడి తమకే సినిమా అమ్మమని. ఎవరెవరి నుంచో ఫోన్లు వస్తున్నాయి. వచ్చిపోయే వాళ్ళతో ఆఫీస్ కిక్కిరిసిపోతోంది. అడ్వాన్సులకు చెక్ ఇస్తే నమ్మరనే అనుమానంతో కొందరు పంపిణీదారులు ఏకంగా క్యాష్ సూట్ కేసులతో వస్తున్నారు. ఈ తాకిడిని మేనేజ్ చేయడం అంత అనుభవమున్న ఏఎం రత్నం వల్ల కూడా కావడం లేదు. అప్పటికప్పుడు సినిమాను అమ్మేసినా రెట్టింపు సొమ్ము వస్తుంది. కానీ ఖుషి మీద ఆయన నమ్మకం వేరు. లెక్కలు వేరు. అది ఎందుకో ఋజువు చేసే రోజు రానే వచ్చింది
26 ఏప్రిల్, 2001
పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత భారీ ఎత్తున ఖుషి ధియేటర్లలో అడుగు పెట్టింది. చిరంజీవి తమ్ముడు అనే బ్రాండ్ నుంచి పవర్ స్టార్ అనే ఇమేజ్ కు అప్పటికే షిఫ్ట్ కావడంతో ఓపెనింగ్స్ లోనే భీభత్సం మొదలయ్యింది. మొదటి రోజు జనం రద్దీ ఇలాంటి సినిమాలకు మాములే కాబట్టి బయ్యర్ల దృష్టి మొత్తం టాక్ మీదే ఉంది. బెనిఫిట్ షోలు మొదలయ్యాయి. డిటిఎస్ సౌండ్ సిస్టం అప్పటికే ఊపందుకుంది. కేకలు ఈలలతో లోపల ఏం జరుగుతుందో తర్వాత షోకి బయట టికెట్ల కోసం ఎదురు చూస్తున్నవాళ్లకు అర్థం కాలేదు. ప్రీమియర్లకు ఇదంతా మామూలే కదాని నిట్టూర్చిన వాళ్లున్నారు. ఆట మొదలై రెండున్నర గంటలు దాటుతున్నా జనం ఇంకా బయటికి రాలేదు. ఇంత పెద్ద సినిమానా అని నిడివి గురించి తెలియని వాళ్ళు నోళ్లు నొక్కుకోవడం మొదలుపెట్టారు. పాటలు, ఫైట్లు వచ్చినప్పుడు వాటి తాలూకు సౌండ్ వైబ్రేషన్స్, ఫ్యాన్స్ అల్లరి ఆ షో మిస్ అయిన అభిమానుల కాళ్ళను కుదురుగా ఉండనివ్వడం లేదు. మొత్తానికి 3 గంటల (ఇంటర్వెల్ గ్యాప్ తో కలిపి)తర్వాత సినిమా అయిపోయింది. పెద్ద కోలాహలంతో అరుచుకుంటూ అభిమానులు బయటికి వస్తున్నారు.
థియేటర్ల బయట ఇంటర్వ్యూలు
ఇప్పట్లా అప్పుడు ఐమ్యాక్స్ బయట యుట్యూబ్ ఛానల్స్ మైకులు లేవు. అప్పటికప్పుడు ఆన్ లైన్ లో రివ్యూలు పెట్టాలన్న హడావిడితో వచ్చే మీడియా బ్యాచులు లేవు. ఉన్నదల్లా సామాన్య ప్రేక్షకులే.
“ఏంటి బాస్, ఎలా ఉంది. తొలిప్రేమ కన్నా బాగుందా, బద్రిని మించిపోద్దా”
” పవర్ స్టార్ ఎలా చేశాడు, వంద రోజులు ఆడుతుందా”
” పాటలు ఎలా తీశారు, పవన్ డాన్స్ బాగా చేశాడా”
” తమిళ డైరెక్టర్ కదా ఏమైనా చెడగొట్టాడా”
” విలన్ మనోడు కాదుగా, వర్కవుట్ అయ్యిందా”
ఇలా రకరకాల ప్రశ్నలు షో చూసిన ఆనందాన్ని కళ్ళ నిండా నింపుకుని వస్తున్న అభిమానులకు ఎదురవుతూనే ఉన్నాయి ఎవరూ సమాధానం చెప్పడం లేదు. నిజానికి వాళ్లకు వర్ణించేందుకు మాటలు చాలటం లేదు. ఎంతో చెప్పాలని ఉంది కానీ ఏదో అడ్డు పడుతోంది. తమ హీరోని ఎలా చూడాలనుకున్నారో అంతకు పదింతలు తెరమీద చూసిన సంతోషాన్ని పంచుకోవాలని ఉంది కానీ దానికి సరిపడా పాండిత్యం వాళ్ళ దగ్గర లేకపోవడంతో గట్టిగా అరిచి మరీ తమ రెస్పాన్స్ వ్యక్తపరిచారు. అప్పటికే వాళ్ళ మధ్య కూర్చుని సినిమా చూసిన కొందరు జర్నలిస్టులకు అర్థమైపోయింది. ఇంకో మూడు నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా ఖుషి రికార్డుల వార్తలతో తమ పత్రిక నిండిపోతుందని, పవన్ స్టిల్స్ ఫోటోలు లేనిదే మ్యాగజైన్లు అమ్ముడుపోవడం జరగని పనని. ఇది వాళ్ళకే మాత్రం అతిశయోక్తి అనిపించడం లేదు. ఎందుకంటే తెలుగు రాని ఓ తమిళ దర్శకుడు పవర్ స్టార్ అనే ఫైర్ స్టేషన్ తో చేసిన మాయాజాలం తాలూకు ప్రభావం అది.
రికార్డుల వేట షురూ
ప్రతి చోటా రికార్డుల ఊచకోత మొదలయ్యింది. టికెట్లు దొరికితే ఏదో పవనే ఇంటికి వచ్చినంత సంబరంగా ఫీలవుతున్నారు ఫాన్స్. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో ఖుషి ఆడుతున్న థియేటర్ల వద్ద కుర్రాళ్ల తాకిడి మాములుగా లేదు. కాలేజీకని ఇంటి నుంచి బయలుదేరిన యువత నేరుగా ఖుషి హాల్ దగ్గరికి వెళ్ళిపోయి టికెట్ల కోసం పాకెట్ మనీ మొత్తం కర్పూరమైపోవడం లెక్క చేయడం లేదు. బ్లాక్ టికెట్ల బ్యాచులకు దసరా రంజాన్ క్రిస్మస్ మూడు పండగలు ఒకేసారి వచ్చినంత రేంజ్ లో ఖుషి డబ్బులు కుమ్మరిస్తోంది. థియేటర్ ఓనర్లు ఫోన్ కాల్స్ భరించలేక ల్యాండ్ లైన్ వైర్ తీసేసి పక్కన పారేశారు. ఒత్తిడిని ఎంతకని తట్టుకుంటారు. సండే లేదు మండే లేదు రోజు ఏదైనా షో ఎప్పుడైనా మొదటిరోజు వేసిన ఎక్స్ ట్రా కుర్చీలు యాభై రోజులు దాటినా తీసే అవసరం పడలేదు. టికెట్లు చింపేవాళ్ళతో ఫ్యాన్స్ కి దోస్తీ కుదిరింది. వారంలో రెండు మూడు సార్లు ఖుషిని చూస్తూ ఉంటే ఆ మాత్రం స్నేహం కుదిరిపోవడంలో ఆశ్చర్యం ఏముంది. అలా అలా యాభై వందా సిల్వర్ జూబ్లీ ని ఖుషి చెప్పులేసుకున్నంత ఈజీగా దాటేసింది. చరిత్రలో తనకో హెడ్డింగ్ పెట్టేసుకుంది
అంత కథ ఉందా
ఓ అమ్మాయి ఓ అబ్బాయి మధ్య కాలేజీలో మొదలైన పరిచయం ప్రేమగా మారుతుంది. కానీ దాన్ని ఒకరితో ఇంకొకరు చెప్పకోరు. ఈలోగా చిన్న ఈగో సమస్య వల్ల ఇద్దరూ విడిపోయే పరిస్థితి వస్తుంది. మరోవైపు ఆ అబ్బాయి స్నేహితుడు ఓ డబ్బున్న బడాబాబు కూతురిని ప్రేమిస్తాడు. దాని వల్ల అతని ప్రాణం మీదకు వస్తే అబ్బాయి అండగా నిలుస్తాడు. అటువైపు లవర్ తో అమ్మాయి ఉంటుంది. మరి చిన్న సంఘటనకే విడిపోయిన ఈ ఇద్దరు చివరికి ఎలా కలుసుకున్నారు, డజను పిల్లలని కనేంత అన్యోన్య దంపతులుగా ఎలా మారారు అనేది క్లైమాక్స్ చివరి దాకా కూర్చుంటే తెలుస్తుంది.
అంతగా ఎందుకు కనెక్ట్ అయ్యింది
ఖుషిని కథగా విన్నప్పుడు ఇందులో ఏముందనిపిస్తుంది. పవన్ రేంజ్ హీరో చేయాల్సిన కథ కాదేమోనని డౌట్ వస్తుంది . కమర్షియల్ సూత్రాలు డిమాండ్ చేసే భారీ ఫైట్లు రక్తపాతాలు లేవు. హీరో హీరోయిన్లు రొటీన్ ట్యూన్లలో డాన్స్ చేయడం గట్రా పెట్టలేదు. అరుపులతో భయపెట్టే విలన్లు, కన్నీళ్లతో కర్చీఫ్ లు తడిపే క్యారెక్టర్లు లేవు. కలిసుందాం రా టైపులో తెరనిండా ఆర్టిస్టులు కానీ సమరసింహారెడ్డి టైపులో మాస్ కి గూస్ బంప్స్ ఇచ్చే హీరోయిజం కానీ చూపించలేదు . ఉన్నదల్లా ఒక సింపుల్ లవ్ స్టోరీ. దాదాపు కథ మొత్తం కాలేజీలోనే సాగుతుంది. ఒక్క క్లైమాక్స్ మాత్రమే స్టేషన్ లో ఉంటుంది. మరి ఖుషి మేజిక్ ఎందులో ఉంది. చెప్పే విధానంలో పండింది . సున్నితంగా చెప్పాలనుకున్న పాయింట్ ని అందరు మెచ్చేలా రాసుకున్న స్క్రీన్ ప్లేలో ఉంది. అందుకే ఖుషి ఎగబడి చూసేంతగా జనానికి పిచ్చపిచ్చగా నచ్చింది.
వన్ అండ్ ఓన్లీ సిద్దు
సిద్ధూ ఉరఫ్ సిద్దార్థ్ రాయ్. ఒక సింపుల్ కుర్రాడు. మంచి లక్ష్యాలు ఉన్నాయి. ఒంట్లో పొగరుంది. స్నేహితుల కోసం ఏదైనా చేసే మంచి మనసుంది. సిగెరెట్ మందు లాంటి అలవాట్లు ఉన్నా తన హద్దులు గుర్తించే ఆలోచనా ఉంది. స్టేజి మీద డాన్సు చేయగలడు. తనకు అనవసరంగా అడ్డొచ్చిన వాళ్ళ తుక్కు రేగ్గొట్టి బుద్ది చెప్పగలడు. అమ్మానాన్నలను ప్రేమించగలడు. రోడ్డు మీద ఆకతాయిలకు గుణపాఠం నేర్పగలడు. అందుకే సిద్ధూని వారు వీరు అనే తేడా లేకుండా అందరూ ఓన్ చేసుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే యూత్ కి తెరమీద సిద్దు కి బదులు ఎవరికి వారే కనిపించారు. అందుకే మళ్ళీ మళ్ళీ తమను తాము అద్దంలో చూసుకునేందుకు ఎగబడ్డారు. కనివిని ఎరుగని ఘన విజయాన్ని ఖుషికి కట్టబెట్టారు. పవన్ ఇందులో ఒదిగిపోయిన తీరు మళ్ళీ ఇంకే సినిమాలో ఈ స్థాయిలో కనిపించలేదనడం అతిశయోక్తి కాదు
మధుమతి అలియాస్ బుజ్జి
ఈతరం అమ్మాయిలకు అచ్చమైన ప్రతినిధి . కిందా పడ్డా తనదే పై చెయ్యి అనడం కాదు కింద తోసింది కూడా మీరే అనేరకం. మనసులో ఎలాంటి కల్మషం లేకపోయినా వెలిగించిన చిచ్చుబుడ్డిలా ఎవరైనా కాస్త రెచ్చగొడితే చాలు ఎప్పుడెప్పుడు దాన్ని అవతలి వారి మీద కోపం రూపంలో బయటపెడదామాని ఎదురు చూస్తూ ఉంటుంది. అర్థం కన్నా అపార్థంలో ఒక అక్షరం ఎక్కువుందని దాన్నే ప్రేమించే విచిత్ర మనస్తత్వం. అయితే ఇదంతా అమాయకత్వానికి మరో రూపం అంతే. అందుకే ఈగో ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు బుజ్జి లాంటి పిల్లే లైఫ్ పార్టనర్ గా కోరుకున్నవాళ్ళు ఎందరో. అందుకే భూమిక ఫోటోలు చాలా నెలల పాటు అలా బ్యాచిలర్స్ గోడలపై స్థానాన్ని ఆక్రమించుకున్నాయి
మిగిలిన ఖుషి బ్యాచ్
గుండెల నిండా ధైర్యం లేకపోయినా ప్రేమించడానికి మాత్రం మనసు ఉన్న బాలు మనపక్కనే ఉన్నట్టనిపిస్తాడు…..
పరువు కోసం కూతురు ప్రేమించినవాడిని చంపడానికి వెనుకాడని గుడుంబా సత్తి సిద్దు లాంటి తెగువ ఉన్నవాడి ముందు ఎవడైనా తలవంచాల్సిందేనని చాటుతాడు…..
అచ్చం మన ఇంట్లో వాళ్ళ లాగే అనిపించే సిద్దు పేరెంట్స్…..
పోత పోసిన పల్లెటూరి మంచితం పంచె కట్టుకొచ్చినట్టు ఉండే భోళాతనపు బుజ్జి తండ్రి…..
ఇలాంటోడొకడు మన పక్కనే ఉండాలనిపించే బాబు మొశాయ్ లాంటి స్నేహితుడు…..
అన్ని మన మధ్యే ఉంటున్న పాత్రల్లా ఒక్కటి తప్ప ఇంకెవరికి అసలు నెగటివ్ ఫీలింగ్సే లేని మనుషుల్లా అనిపించే ఖుషిలోని ప్రతిఒక్కరు చూసే ప్రేక్షకులకు అంత దగ్గరయ్యారు కాబట్టి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని మాస్టర్ పీస్ గా ఖుషిని నిలబెట్టారు
సూర్య ది గ్రేట్
ఒక మాములు ప్రేమకథను ఇంత ఎంటర్ టైనింగ్ గా ఎలా చెప్పాడాని ఇతర దర్శకులు సైతం ఖుషిని ఒక రిఫరెన్స్ గా చూసుకున్నారంటే ఇందులో ఉన్న సీన్స్ గొప్పదనం గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. ఇంట్రోలో పవన్ ఫైట్, బుజ్జి ఇంట్రడక్షన్, సిద్దు మధులు మొదటిసారి కలుసుకున్న గుడి సన్నివేశం, సిద్ధూ తన అమ్మతో ఫోన్ లో మాట్లాడుతుంటే బయట నుంచి చూస్తూ మధు ఉడికిపోవడం, రోడ్డు మీద కుర్ర రౌడీ బ్యాచ్ కి కర్రతో క్లాసు పీకడం, కార్నివాల్ యాక్షన్ ఎపిసోడ్, క్లైమాక్స్ లో డ్రామా ఒకటా రెండా ఇంత ఫ్రెష్ గా సూర్య ఎలా ఆలోచించాడా అని సామాన్య ప్రేక్షకుడు కూడా అబ్బురపడ్డాడంటే దాన్ని బట్టే చెప్పొచ్చు ఇతని ప్రతిభ ఏ స్థాయిలో ఉందొ. పది నిమిషాలకు పైగా రెండు మూడు పొడి మాటలతోనే సిద్దు మధుల మధ్య నడుము గురించి వచ్చే గొడవ సీన్ కు ముగ్ధులు కాని వాళ్ళు లేరు. ఇలా ఎలా ఆలోచిస్తారా అని సూర్య గురించి మాట్లాడుకున్న డైరెక్టర్స్ ని లెక్క బెట్టడం కష్టం
మణి- శ్రీరామ్ ల మాయాజాలం
తెలుగు సినిమా చరిత్రలో ఒక పూర్తి హింది పాటను హీరో పరిచయం గీతంగా పెట్టడం అదే మొదటిసారి. ఇప్పటితరానికి అవగాహన లేని ఆడువారి మాటలకు అర్థాలే వేరులే పాటని న్యూ జెనరేషన్ కు తగ్గట్టు రీమిక్స్ చేసి పదే పదే టేప్ రికార్డర్ లో ఆ పాట మారుమ్రోగిపోయేలా చేయడం అంత సులభం కాదు. ఆటో ఎక్కినా, టీ కొట్టు దగ్గర నిలబడినా అన్ని స్పీకర్లలోనూ అమ్మాయే సన్నగా అరనవ్వే విసరగా పాటే వినిపించేది . ఘజ్జెఘల్లు మన్నాదిరో సాంగ్ కు అభిమానుల ఉత్సాహం తట్టుకోలేక చాలా చోట్ల కుర్చీలు విరిగిపోయాయి. చెలియా చెలియా చిరు కోపమా, ప్రేమంటే సులువు కాదురా పాటలు చాలా కాలం మెలోడీ లవర్స్ వాక్ మెన్లలో రీల్ అరిగిపోయే దాకా రిపీట్ మోడ్ లో తిరుగుతూనే ఉన్నాయి. మణిశర్మ కెరీర్ బెస్ట్ ఆల్బమ్స్ ని లిస్టు చేయడం కష్టమే కాని టాప్ ప్లేస్ లో ఏది పోటీ పడినా ఖుషి మాత్రం వైల్డ్ కార్డు ఎంట్రీతో దూసుకోస్తుంది. ఇక ఇండియాస్ ఫైనెస్ట్ కెమెరామెన్ లలో ఒకరైన పిసి శ్రీరామ్ ఫ్రేమ్స్ గురించి చెప్పుకుంటే ఓ పెద్ద గ్రంథమే అవుతుంది. కోల్కతా బ్యాక్ డ్రాప్ ని, కాలేజీ సెటప్ ని, లొకేషన్ ఏదున్నా సీన్స్ లోని ఫ్రెష్ నెస్ ని ఒడిసిపట్టుకుని తన కన్నుతో చూపించిన తీరు సింప్లీ మార్వలెస్.
ఆఖరిగా ఇంకొక్క మాట
కథ డిమాండ్ చేస్తోందనో లేక సహజత్వం కోసమనో చెప్పి చొక్కాలు విప్పే సీన్లు, పచ్చి బూతులు మాట్లాడే పాత్రలు, నేల విడిచి సాము చేసే హీరోయిజం ఇవేవి లేకుండా మెచ్యుర్డ్ ఏజ్ లో ఉన్న ఓ అమ్మాయి అబ్బాయిల మధ్య పరిచయం ప్రేమగా మారే వైనాన్ని ఎలాంటి లిప్ లాక్ కిస్సులు చూపించకుండా కేవలం ఈగో అనే థ్రెడ్ తో ఇంత ఎంటర్ టైనింగ్ గా చూపించిన ఖుషి మూవీ లవర్స్ లైబ్రరీలో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఏదో పవన్ ఉన్నాడని ఇది ఆడలేదు. ప్రేక్షకుల మనసులను ఆడించే కంటెంట్ లో పవన్ సరితూగాడు కాబట్టి ఖుషి బ్లాక్ బస్టర్ అయ్యింది. దానికి మిగిలిన నటీనటుల మద్దతు, సాంకేతిక వర్గం నైపుణ్యం ఇవన్నీ తోడై ఖుషికి సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని నిలిపాయి. పవన్ ఇంకో పాతిక సినిమాలు చేసినా, దీని రికార్డులు అత్తారింటికి దారేది బద్దలు కొట్టినా ఖుషి ప్లేస్ ని ఇంకో పవర్ స్టార్ సినిమా తీసుకోవడం అసాధ్యం.