iDreamPost
iDreamPost
ఎన్డీయేలో వైసీపీ చేరితే జనసేన బయటకి వస్తుంది ,
బీజేపీ కూడా వైసీపీతో పొత్తు పెట్టుకోదు ,
అదే జరిగితే బీజేపీతో కలిసి నడవను ,
ఇవీ ఈ రోజు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు .
ఈ రోజే కాదు పవన్ పార్టీ పెట్టిన నాటి నుండి నేటి వరకూ గమనిస్తే ఒక లక్ష్యం లేకుండా గమనం ఎటో తెలీకుండా ఆదిలోనే బాబు ఉచ్చులో చిక్కుకొని జగన్ పై వ్యతిరేకతను రాను రానూ పెంచుకొంటూ ఆ పెరిగిన ఆకారణ ద్వేషం తన పార్టీనే కబలిస్తుంది అన్న సత్యం తెలుసుకోకుండా గర్వంతో విర్రవీగే పౌండ్రక వాసుదేవుణ్ణి గుర్తు చేయక మానదు .
ఈ ఆకారణ ద్వేషమే పవన్ ని తనకు తెలియకుండా తాను జగన్నామ స్మరణ చేసేట్లు చేస్తోంది .
2014 లో జగన్ సీఎం అయితే తుపాకీ పట్టుకొని అడవులకు పోతానన్న వ్యక్తి , ఎన్నికల తర్వాత టీడీపీ హామీలు అమలు చేయకపోతే మాట మాత్రం ప్రశ్నించే సాహసం చేయకపోగా , హామీల అమలు పై , ప్రజా సమస్యలపై వైసీపీ పోరాటం తలపెట్టిన ప్రతిసారీ , అదే సమస్య పై తాను కూడా ఉద్యమిస్తా అంటూ పోటీ సభ పెట్టి అధికార టీడీపీని ప్రశ్నించటం మానేసి జగన్ సరిగ్గా నిలదీయట్లేదు , వైసీపీ పోరాడట్లేదు అంటూ ప్రతిపక్షం పై విమర్శలు గుప్పించటం వెనక మర్మం జగన్ పై పవన్ కున్న అసూయా , టీడీపీ ప్రయోజనాల మేరకు అనేది నగ్న సత్యం .
ఈ అసూయ , ద్వేషం జగన్ తో ఆగిపోలేదు , జగన్ చుట్టూ వున్న నాయకులు , ఆఖరికి జగన్ జన్మస్థలం వరకూ పాకింది . అందుకే వైసీపీ వాళ్ళ తాట తీస్తా అనడం , కన్నబాబు పై తీవ్ర విమర్శలు గుప్పించడం , ఉరికిచ్చి కొడతా అనడం , రాయలసీమ రౌడీయిజం , కడప గూండాయిజం చూపిస్తే అంతు చూస్తా అంటూ ప్రాంతీయ భేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం , పులివెందుల వేషాలేస్తే తోలు వలుస్తా అంటూ జగన్ స్వస్థలం పై అక్కసు వెలగక్కడం లాంటి వ్యాఖ్యలతో మరింత అభాసు పాలయ్యాడు .
2019 లో టీడీపీతో ఉంటే ప్రజలు నమ్మరు అని తెలుసుకొన్న పవన్ కమ్యూనిస్టుల చెంత చేరి పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేసినా లోపాయికారీగా టీడీపీ నిర్దేశించిన మార్గంలోనే నడవటంతో అన్ని విధాలా భంగపాటు తప్పలేదు . చివరికి తాను రెండు చోట్లా ఓడిపోయి రాపాక పుణ్యాన ఒక సీటు దక్కినా పవన్ కి రాజకీయం బోధపడలేదు .
2019 ఎన్నికల తర్వాత పార్టీ పెట్టిన నాటి నుండి వెన్నంటి ఉన్నవారు ఇహ ఇతను రాజకీయాలకు పనికిరాడు . తనకోసం తనపార్టీ కోసం కాకుండా మరొకరి ప్రయోజనాల కోసం జగన్ లక్ష్యంగా పరిపక్వత లేని రాజకీయాలు చేస్తున్నాడు అని సొంత వారే విమర్శించి పార్టీ వదిలిపోయినా జ్ఞానోదయం కాలేదు పాపం .
చివరికి 2019 లో కలిసి పనిచేసిన కమ్యూనిస్టులతో పొత్తుని తుంగలో తొక్కి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు కోసం మతం రంగు పులుముకొని విద్వేషాలు రెచ్చగొట్టే తీవ్ర వ్యాఖ్యలు చేసి ఢిల్లీ పోయి బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి భంగపడి చివరికి ఒకరిద్దరు నాయకుల్ని కలిసి 2024 ఎన్నికల్లో కలిసిపని చేస్తాం అని వ్యాఖ్యానించుకొని వచ్చి బిల్డప్ ఇద్దామని చూసినా అదీ ఫలించకపోవడం . మరో పక్క జగన్ రాష్ట్రంలో తన ప్రభుత్వ బిల్లులకు ఉన్న చట్టపరమైన అడ్డంకుల్ని తొలగించుకొనే యత్నంలో బీజేపీ అధినాయకత్వంతో తరుచూ కలుస్తూ ఉన్న సానుకూల వాతావరణాన్ని చూడగానే యధావిధిగా చిర్రెత్తిపోయిన పవన్ , వైసీపీ ఎన్డీయేలో చేరుతుందన్న వార్త ఎక్కడా లేకపోయినా ఆ భయాన్నీ వ్యక్తం చేస్తూ వైసీపీ చేరితే నేను బయటికొస్తాను అని వ్యాఖ్యానించడం జగన్ పట్ల ఉన్న అసూయకి వ్యతిరేకతకి నిదర్శనం .
తాను ఎన్డీయేతో ఉండటం తన అవసరమో , బీజేపీ అవసరమో గుర్తించి వ్యాఖ్యలు చేస్తే బాగుండేది . 300 కు పైగా ఎంపీలతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని , ప్రతిరోజూ పార్టీని ధిక్కరిస్తూ పవన్ ని పూచికపుల్లలా చూస్తూ ఏ రోజుపోతాడో తెలియని సింగిల్ ఎమ్మెల్యే పార్టీ నాయకుడు నేను ఉండను పోతా అని బెదిరించడం అత్యంత హాస్యాస్పదం అని ఎప్పటికి తెలుసుకొంటాడో పాపం పవన్ .
ఈ వ్యతిరేక పైత్యం చివరికి జగన్ రాజకీయాలు చేస్తే నేను రాజకీయాలు చేయను . జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఉండను అని ఏదొక రోజు వ్యాఖ్యలు చేస్తారేమో!!!