iDreamPost
iDreamPost
ఏపీ ముఖ్యమంత్రికి అనూహ్య మద్ధతు లభించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఎం ఎం పళ్లంరాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ నేతలు చంద్రబాబు అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తుండగా పళ్లంరాజు మాత్రం భిన్నంగా స్పందించి ఆశ్చర్యపరిచారు.
ఇప్పటికే బీజేపీలో భిన్నస్వరాలు అందరికీ అర్థమవుతున్నాయి. జీవీఎల్ , సోము వీర్రాజు, మాధవ్ వంటి నేతలు వికేంద్రీకరణకు సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నారు. అదే సమయంలో కన్నా, సుజనా వంటి నేతలు మాత్రం జై అమరావతి అంటున్నారు. సరిగ్గా అదే రీతిలో కాంగ్రెస్ నేతల తీరు కూడా ఉండడం విశేషం. మూడు రాజధానుల నిర్ణయం ఏపీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని పళ్లంరాజు పేర్కొన్నారు. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను చంద్రబాబు ఖాతరు చేయలేదన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చంద్రబాబు అమరావతి ని రాజధాని చేశారని విమర్శించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏపీ నేతలు శైలజానాథ్, తులసీరెడ్డి వంటి నేతలు మాత్రం జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. సోనియాగాంధీ కుటుంబానికి సన్నిహితంగా మెలిగే పళ్లంరాజు తీరు జగన్ నిర్ణయానికి అనుకూలంగా ఉండడం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక వ్యవహారంగా మారిన అమరావతి విషయంలో జగన్ కి పల్లంరాజు నుంచి లభించిన మద్ధతు చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే చిరంజీవి వంటి ప్రముఖులు కూడా మూడు రాజధానులకు సై అనగా తాజాగా పళ్లంరాజు వంటి వారు కూడా తోడుకావడంతో కాపు సామాజికవర్గం నుంచి జగన్ కి మద్ధతు పెరుగుతున్నట్టుగా కొందరు భావిస్తుండడం విశేషం.