డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. ఈ డైలాగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అనే విషయం అందరికీ తెలుసు. ఒక గొప్ప నగర వ్యాపారి అయి ఉండి కూడా తన బ్రాండ్ ని తానే ప్రమోట్ చేసుకుంటారు. నిజానికి ఎంతో మంది స్టార్స్ తో పోలిస్తే ఆయన యాడ్స్ కే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. ఇంక నగల వ్యాపారంలో లలితా జ్యూవెలరీ కిరణ్ కుమార్ ఎంత సక్సెస్ అయ్యారు అనేది అందరికీ తెలుసు. అయితే ఆయన లైప్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? లైఫ్ లో ఎన్ని కష్టాలు పడ్డారు? అసలు లలితా జ్యూవెలరీ ఓనర్ ఎవరు? అంటూ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ స్వయంగా వీడియో విడుదల చేశారు.
గోల్డ్ రిటైల్ మార్కెట్ లో లలితా జ్యూవెలరీ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది. దాని ఓనర్ కిరణ్ కుమార్ కి కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. తక్కువ ధరకే నాణ్యమైన బంగారం అమ్మకం చేస్తారంటూ గుడ్ విల్ సొంతం చేసుకున్నారు. ఆయన ఎంత సక్సెస్ అయ్యారు అంటే దేశవ్యాప్తంగా 49 స్టోర్స్ నుంచి 50వ స్టోర్ ప్రారంభించే స్థాయికి చేరుకున్నారు. కానీ, ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనే విషయం మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన స్టోరీని స్వయంగా ఆయనే వివరిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.
“నేను నెల్లూరు నుంచి వచ్చాను. ఓరోజు అమ్మ నాన్నతో.. ఇంట్లోకి కిరాణా సరుకులు తీసుకురామని చెప్పింది. డబ్బులు ఉంటే తీసుకురానా? అని నాన్న ప్రశ్నించారు. ఆ మొత్తం విషయాన్ని నేను గమనించాను. వెంటనే నేను చదువు మానేసి.. పనికి వెళ్లడం మొదలు పెట్టాను. నెల్లూరులో బంగారు ఆభరణాలు తయారు చేసే షాపులో చేరాను. పని నేర్చుకున్నాను. అప్పట్లో నెల్లూరు ప్రాంతంలో తయారు చేసే జుమ్కీలు బాగా ఫేమస్. కొన్ని రోజుల తర్వాత అమ్మకు ఉన్న 4 బంగారు గాజులను తీసుకున్నాను. అవి మొత్తం 48 గ్రాముల గాజులు. వాటిని కరిగించి జుమ్కీలు తయారు చేశా.
వాటిని అమ్మేందుకు చెన్నై వెళ్లాను. అక్కడ ఎవరూ నేను చేసిన వాటిని కొనుగోలు చేయలేదు. కానీ, లలితా జ్యూవెలరీ వాళ్లు కొన్నారు. ఆ తర్వాత నా వ్యాపారం చిన్నగా పెరుగుతూ వచ్చింది. కేవలం మూడేళ్లలోనే చెప్పుకోదగ్గ గోల్డ్ హోల్ సేలర్ అయ్యాను. అందరూ నాకు బగారం ఇచ్చి వ్యాపారం చేశారు. ఓ రోజు లలితా జ్యూవెలరీ ఫౌండర్ కందస్వామి నాతో మాట్లాడారు. ఆయన ఆర్థికంగా చితికిపోయినట్లు చెప్పారు. తనకు ఆత్మహత్యే శణ్యం అన్నారు. అయితే ఈ షాపు ఎవరి చేతికీ వెళ్లకూడదని రాత్రికి రాత్రి నేనే కొనుగోలు చేశాను. అప్పటి నుంచి నేను హోల్ సేలర్ నుంచి రిటైలర్ అయ్యాను.
నా వ్యాపారం మొత్తం మారిపోయింది. అందరూ నన్ను కాంపిటీటర్ గా చూశారు. నా దగ్గర హోల్ సేల్ లో బంగారం కొనడం మానేశారు. ఒక్కరోజులో నా వ్యాపారం కొలాప్స్ అయింది. ఆ తర్వాత నా హోల్ సేల్ ఫార్ములాను రిటైల్ లో కూడా అప్లై చేశాను. అక్కడి నుంచి నా సక్సెస్ ప్రారంభమైంది. రిటైల్ లో కూడా నేను ఈ స్థాయికి చేరాను. ఇప్పుడు నేను వచ్చిన నెల్లూరులో 50వ స్టోర్ ప్రారంభించబోతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.