iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ సమావేశానికి విపక్షాలు గైర్హాజరు

కాంగ్రెస్ సమావేశానికి విపక్షాలు గైర్హాజరు

దేశంలో అనేక నిరసనలకు కారణం అవుతున్న కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై చర్చించేందుకు కాంగ్రెస్‌ సోమవారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని తలపెట్టింది. అయితే ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకుండా విపక్షాలు ఆఖరికి కాంగ్రెస్ మిత్ర పక్షాలు కూడా షాకిచ్చాయి.

ప్రస్తుతం దేశంలో సాగుతున్న అల్లర్లకు కారణమయిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై చర్చించడానికి ముందుకు రావాలని విపక్షాలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. కాగా ఈ అఖిల పక్ష సమావేశానికి హాజరు కాకుండా ప్రధాన విపక్ష పార్టీలు మొండిచెయ్యి చూపాయి. మొదటినుంచి ఎన్‌ఆర్‌సీ, సీఏఏని వ్యతిరేకిస్తూ వస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరు కాబోనని ప్రకటించారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏకి వ్యతిరేకంగా భారీ ర్యాలీలు చేపట్టిన మమతా బెనర్జీ అదే ఎన్‌ఆర్‌సీ, సీఏఏ గురించి చర్చించడానికి తలపెట్టిన అఖిల పక్ష సమావేశానికి మొండి చెయ్యి చూపించడం గమనార్హం.

మమతా బెనర్జీ ప్రకటన తర్వాత బీఎస్పీ చీఫ్‌ మాయావతి కూడా కాంగ్రెస్ సమావేశానికి హాజరు కాబోనని తెలిపారు. కాంగ్రెస్‌ నేతలపై మాయావతి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బహిరంగ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా కాంగ్రెస్ నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడం లేదు.

విపక్ష పార్టీలు మొండి చెయ్యి చూపగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ మిత్రపక్షమైన శివసేన కూడా అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు కావడం గమనార్హం. మొదట్లో శివసేన తరపున ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ పాల్గొంటారని ప్రచారం జరిగింది. కానీ అయన కూడా సమావేశానికి హాజరు కాలేదు.

కాగా ఎన్సీపీ, ఆర్జేడీ, వామపక్షాలు, డీఎంకే, ఎస్పీ పార్టీలు మాత్రమే ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరుకానున్నాయి. దీంతో కాంగ్రెస్ కు విపక్షాలన్నీకలిసి షాక్ ఇచ్చినట్లయింది.కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై  వేరు వేరుగా ఉధృతంగా నిరసన తెలిపిన ఈ ప్రధాన పార్టీలన్నీ అదే న్‌ఆర్‌సీ, సీఏఏ పై చర్చించడానికి కాంగ్రెస్ తలపెట్టిన సమావేశానికి హాజరు కాకపోవడంపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఏదిఏమైనా అన్ని పార్టలను కలుపుకుని బీజేపీకి అడ్డుకట్ట పనిచేయాలని కాంగ్రెస్ కు మాత్రం ఇది పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు.