Idream media
Idream media
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం వలస కూలీలకు ఏం చేసిందని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ మేరకు పిఎం కేర్స్ నిధులు, వలస కార్మికుల సమస్యలపై కేంద్రానికి ప్రశ్నల వర్షం కురుపించారు.
ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ (పిఎం కేర్స్) ఫండ్ నుంచి కూలీలకు ఎంత ఇచ్చారో చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మోడీని కోరుతున్నట్లు తెలిపారు.
పిఎం కేర్స్ నిధి నుంచి కూలీలకు ఎంత ఇచ్చారో చెప్పగలరా? అని ప్రధాని మోడీని కపిల్ సిబల్ నిలదీశారు. కోవిడ్-19 మహమ్మారిని నిరోధించేందుకు అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం సమయంలో చాలా మంది మరణించారన్నారు. రోడ్లపై నడుస్తూ కొందరు, రైళ్ళలో కొందరు, ఆకలితో మరికొందరు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ విధంగా మరణించినవారి కుటుంబాలకు ఎంత నష్టపరిహారం ఇచ్చారో చెప్పాలన్నారు.
విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం, ప్రాణాలు కోల్పోయినపుడు, జీవనోపాధి పునరుద్ధరణకు ప్రభుత్వమే నష్టపరిహారం, సహాయం అందజేయాలని చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో మరణించినవారి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం, సహాయం ఇచ్చిందా? అని అడిగారు. వితంతువులు, అనాథలకు కూడా సహాయపడాలని విపత్తు నిర్వహణ చట్టం ప్రత్యేకంగా పేర్కొందని తెలిపారు. ఇటువంటి వారికి ప్రభుత్వం ఎంత మేరకు సహాయపడిందో తెలియజేయాలని కోరారు.
వలస కార్మికుల విషయంలో కేంద్రం ఏం చేసింది? సీతారామ్ ఏచూరి
కరోనాను అరికట్టడంలో, వలస కార్మికుల కష్టాలను తొలగించడంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ‘‘మనం ఏం చేయాలో కేంద్రం చెబుతోంది. మరి మహమ్మారిని నియంత్రించడంలో కేంద్రం చేస్తుందో చెప్పలేదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతోన్న కార్మికులకు కేంద్రం ఏం చేసింది? స్వస్థలాలకు చేరుకోడానికి ఇంకా కార్మికులు వీధుల్లోనే నిల్చున్నారు. స్వస్థలాలకు చేరుకోడానికి రెండు నెలలుగా ఎదిరు చూస్తున్నారు. వారికి కేంద్రం ఏం చేస్తోంది?’’ అని ప్రశ్నించారు. వలస కార్మికులకు ఆహార ధాన్యాలను అందించడంతో పాటు వారికి నేరుగా డబ్బును అందిస్తే కొంతలో కొంత వారికి మేలు కలుగుతుందని ఏచూరి సూచించారు.