iDreamPost
android-app
ios-app

జగన్ కు ప్రతిపక్షాలు మద్దతివ్వాలంటున్న బిజెపి .. ఇరకాటంలో చంద్రబాబు, పవన్

  • Published May 13, 2020 | 11:11 AM Updated Updated May 13, 2020 | 11:11 AM
జగన్ కు ప్రతిపక్షాలు మద్దతివ్వాలంటున్న బిజెపి .. ఇరకాటంలో చంద్రబాబు, పవన్

ఏపిలో రాజకీయాలు రోజుకో తీరుగా మారిపోతోంది. తాజాగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్కీమ్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు నీటిని అందించాలన్న జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు ప్రతిపక్షాలన్నీ మద్దతివ్వాలన్న బిజెపి ఇచ్చిన పిలుపుతో అందరూ ఇరకాటంలో పడిపోయారు. బిజెపి కూడా అధికార వైసిపికి ప్రతిపక్షమే అన్న విషయం అందరికీ తెలిసిందే. అంటే ప్రతిపక్షాలన్నీ జగన్ కు మద్దతుగా నిలవాలంటూ ఓ ప్రతిపక్షం పిలుపువ్విటం విచిత్రమనే చెప్పాలి. అయితే ఇందులో రాష్ట్రప్రయోజనాలు మాత్రమే ఉందని కూడా బిజెపి నేతలు తమ పిలుపును సమర్ధించుకుంటున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా సముద్రంలో కలిసే మిగులు జనాలను రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరుకు తరలించేందుకు ఓ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని జగన్ సర్కార్ డిసైడ్ అయ్యింది. ఇందుకోసం 203 జీవోను కూడా జారీ చేసింది. ఇక్కడే తెలంగాణా సిఎం కేసీయార్ అడ్డం పెడుతున్నాడు. ఏకపక్షంగా ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదంటూ మండిపోతున్నాడు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామంటూ చాలెంజ్ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణా ప్రయోజనాల రీత్యా ప్రతిపక్షాలన్నీ కేసియార్ కు మద్దతుగా నిలబడుతున్నాయి. అదే ఏపి విషయానికి వచ్చే సరికి జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఇపుడు ఎత్తిపోతల పథకం నిర్మాణం విషయంలో కూడా చంద్రబాబు అండ్ కో తమకు సంబంధం లేని విషయంగా చోద్యం చూస్తున్నారు. సరిగ్గా ఇదే విషయంలో బిజెపి ఉపాధ్యక్షుడు విష్ణువర్ధనరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలంటూ డిమాండ్ చేస్తున్నాడు.

విష్ణు డిమాండ్ బాగానే ఉంది. కానీ మరి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇంత వరకు ఎందుకు నోరిప్పలేదు. రాష్ట్రప్రయోజనాల కోసమంటూ విష్ణు ఇచ్చిన పిలుపుతో టిడిపి, జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ ఎలా స్పందిస్తాయో చూడాల్సిందే. మొత్తం మీద జగన్ కు మద్దతివ్వాలని ఓ ప్రతిపక్షం మిగిలిన ప్రతిపక్షాలకు పిలుపువ్విటం ఆశ్చర్యంగానే ఉంది.