iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రివర్స్ స్వింగ్ కనిపిస్తోంది. సహజంగా అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తుంటాయి.. పాలకపక్షాలు జాప్యం చేస్తుంటాయి. కానీ ఏపీలో మాత్రం అధికార పక్షం విచారణల పర్వం కొనసాగిస్తోంది. విపక్షం దానిని తప్పుబడుతోంది. కక్ష సాధింపు చర్యగా వర్ణిస్తోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. గత ప్రభుత్వ విధానాలపై గంపగుత్తగా దర్యాప్తు సాగించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడంతో కలకలం సాగుతోంది. చివరకు ఎటు మళ్లుతుందోనననే ఉత్కంఠ కనిపిస్తోంది.
గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఈఎస్ఐ కుంభకోణంలో ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలు లభించడంతో టీడీపీ శిబిరంలో ఉలికిపాటు కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పూనుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారబోతోంది. ఇక ఇప్పుడు అచ్చెన్న తర్వాతి వంతు యనమలదేననే ప్రచారం మొదలయ్యింది. యనమల రామకృష్ణుడు గత సర్కారులో ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. ఇప్పటికే సింగపూర్ లో ఆయన పన్ను పీకించుకునే వ్యవహారంలో చివరకు తప్పిదాన్ని అంగీకరించారు. ఆ తర్వాత సొంత భవనాలను ప్రభుత్వాఫీసులుగా మార్చి, పెద్ద మొత్తంలో నిధులు డ్రా చేశారనే ఆరోపణలున్నాయి. దానికి సంబంధించిన జీవోలు కూడా ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి.
అన్నింటికీ మించి యనమల వియ్యంకుడు పోలవరం సబ్ కాంట్రాక్టుల వ్యవహారం కీలకంగా మారబోతోంది. 2018లో పోలవరం పనులను విభజించి సబ్ కాంట్రాక్టుల కేటాయింపులో భాగంగా పుట్టా సుధాకర్ యాదవ్ కి సుమారు రూ.500 కోట్ల విలువ చేసే పనులు అప్పగించారు. అయితే పనుల విషయంలో పెద్ద మొత్తంలో గోల్ మాల్ జరిగిందన్నది ఇప్పటికే పోలవరం విషయంలో సాగించిన దర్యాప్తులో ప్రాధమిక నిర్ధారించినట్టు సమాచారం. ఆయనతో పాటుగా నాటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా అనుచరులకు సంబంధించిన ఓ కాంట్రాక్ట్ సంస్థలో కూడా ఇదే రీతిలో వ్యవహరించి, చేసిన పనులకు, విడుదలయిన నిధులకు పొంతన లేని పరిస్థితి ఏర్పడిందని అధికారులు అంగీకరిస్తున్నారు. దాంతో ఇప్పుడు సిట్ ఈ విషయంపై మరింత లోతుగా దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే అచ్చెన్న తర్వాత యనమల ఆ వరుసలో నిలుచోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆర్థికమంత్రిగా సొంత వియ్యంకుడి సంస్థకు కాంట్రాక్టుల విషయంలో కేటాయింపులకు చేతికి వెన్ను లేదన్నట్టుగా వ్యవహరించిన తీరు వివాదంగా మారే అవకాశం ఉంది. ఆధారాలు దొరికితే మాత్రం అడ్డంగా బుక్కవడం ఖాయమనే వాదన కూడా ఉంది.
ఇప్పటికే యనమల సహా టీడీపీ నేతంతా సిట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండడం వెనుక కారణం ఇదేనని అంతా భావిస్తున్నారు. ఏకంగా సిట్ ప్రత్యేక అధికారి మీద విమర్శలకు పూనుకోవడం విశేషం. తద్వారా సిట్ వెలికితీసే విషయాలను ప్రజలు విశ్వసించకుండా చేయాలనే లక్ష్యంతో టీడీపీ ఉన్నట్టు కనిపిస్తోంది. తమ బండారం బయటపడినప్పటికీ అదంతా కక్ష సాధింపు చర్యలుగా చిత్రీకరించాలనే రీతిలో సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ పరిణామాలతో ప్రభుత్వం దూకుడు, ప్రతిపక్షం ఎత్తులు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో చూడాలి. యనమల , ఆయన వియ్యంకుడు భవితవ్యం ఎటు మళ్లుతుందో ఆసక్తికరమే.