గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఒక పెళ్లి వల్ల ఇప్పుడు తెనాలి పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చివరికి ఈ వివాహానికి హాజరైన బందు మిత్రులు 70 మందిని ఒకేసారి క్వారైంటన్ కు తరలించాల్సివచ్చింది.
కృష్ణా జిల్లా మచిలీపట్నం గాంధీనగర్ కు చెందిన దంపతులిరువురు తెనాలి లో జరిగిన వివాహానికి హాజరైన అనంతరం వారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం తో బుధవారం వారిని విజయవాడ లోని కరోనా ఐసొలేషన్ వార్డు కు తరలించడంతో ఈ దంపతులు ఇరువురూ గతనెల ఏప్రిల్ 16 న తెనాలి లో జరిగిన వివాహానికి హాజరైన విషయం బయటకి పొక్కింది.
కాగా, ఈ దంపతులను విచారించగా, తాము అదే రోజు సాయత్రం విజయవాడలో జరిగిన మరో వివాహానికి కూడా హాజరైనట్టు వెల్లడించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు గత నెల 16 న తెనాలి మారీస్ పేట లో సదరు వివాహానికి హాజరైన 70 మందిని గుర్తించి హుటాహుటిన అందరిని క్వారంటైన్ కు తరలించారు.
అంతటి తో ఆగకుండా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వధూ, వరుల కుటుంబాలపై కేసు నమోదు చేసినట్టు తెనాలి తహసీల్ధార్ రవిబాబు తెలిపారు. అయితే ఈ దంపతులు హాజరైన విజయవాడ పెళ్లికి వచ్చిన వారందరినీ ఇప్పటికే గుర్తించి వారిలో కొందరు కరోనా వైరస్ బారిన పడినట్టు నిర్ధారణవడం తో వారిని ప్రత్యేక కరోనా ఐసోలెషన్ వార్డు కు తరలించారు.
లాక్ డౌన్ సమయంలో తెలిసీ తెలియక చేసిన పనికి ఇప్పుడు ఈ రెండు పెళ్ళిళ్లకు చెందిన వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో కరోనా టెన్షన్ మొదలవడంతో పాటు, వివాహం జరిపించిన ఇరు కుటుంబాలకు చట్ట పరంగా కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఒక్క వివాహం ఎంత పని చేసిందని ఇప్పుడు బంధు మిత్రులతో పాటు చుట్టుపక్కల వారు అందోళన వ్యక్తం చేస్తున్నారు.