iDreamPost
iDreamPost
జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న విషయంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికార పార్టీ తమ పరిపాలన బ్రహ్మాండమని సహజంగానే అనుకుంటుంది. అదే సమయంలో పరిపాలన మొత్తం అవినీతి, అరాచకాల మయమని ప్రధాన ప్రతిపక్షం టిడిపి నానా గోల చేస్తోంది. ఇక మిగిలిన ప్రతిపక్షాలు కూడా చంద్రబాబునాయుడుకు పక్కవాయిద్యంగా మారిపోయాయి. ఎల్లోమీడియా సంగతైతే చెప్పనే అక్కర్లేదు. జగన్ అఖండ మెజారిటితో వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు ఎంత బాధపడుతున్నాడో అంతకుమించి ఎల్లోమీడియా పడుతున్న బాధ అందరికీ అర్ధమవుతునే ఉంది.
సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే జగన్ పాలనపై ఎన్టీవీ సర్వే నిర్వహించింది. దాని సారంసం ఏమిటంటే జగన్ పై జనాల్లో అభిమానం చెక్క చెదరలేదని. ఏడాది క్రితం ఎంతటి అభిమానంతో ఓట్లేసి అఖండ మెజారిటి ఇచ్చారో అదే అభిమానం ఏడాది తర్వాత కూడా కనబడుతోందని సర్వేలో తేలిందట. మామూలుగా ఎవరు అధికారంలోకి వచ్చినా తన హామీలు అమల్లోకి తేవటానికి చాలా సమయం తీసుకుంటారని జనాలు అభిప్రాయపడ్డారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలన్నింటినీ అమల్లోకి జగన్ తెచ్చేయటం ఆశ్చర్యంగా ఉందన్నారట జనాలు.
పిల్లల చదువుల కోసమని అమలు చేస్తున్న ’అమ్మఒడి’ పేద పిల్లల కోసం ప్రవేశపెట్టాలని అనుకుంటున్న ’ఇంగ్లీషుమీడియం స్కూళ్ళు’ విషయంలో మెజారిటి జనాలు సంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో తేలిందట. రైతు భరోసాతో రైంతాగాన్ని ఆదుకుంటున్న విషయంలో కూడా అన్నదాతలు హ్యాపీగా ఉన్నట్లు చెప్పింది. ఇరిగేషన్ పథకాల్లో స్పీడు పెంచటానికి నిధుల కొరతే పెద్ద అడ్డంకిగా మారిందని ఎన్టీవీ చెప్పింది. అదే సమయంలో రివర్సు టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేయటం పట్ల జనాలు సానుకూలంగానే ఉన్నట్లు చెప్పింది.
అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ న్యాయ వ్యవస్థతో కాస్త ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. తాను కోరుకుంటున్నట్లు మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉండాలంటే జగన్ చాలా ఓపికగా ఉండాలని అభిప్రాయపడింది. అనుకున్న పని అనుకున్నట్లుగా జరిగిపోవాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కాని పని అని, కొన్ని ప్రతీబంధకాలు ఏర్పడటం సహజం అని వాటిని ఎలా అదిగమించాలనే విషయంపై జగన్ దృష్టి సారించాలని సూచించింది.
అదే సమయంలో ప్రతిపక్షాల విషయంలో జనాలు పెద్దగా సానుకూలత వ్యక్తం చేయటం లేదట. మూడు రాజధానుల ప్రతిపాదన విషయంలో టిడిపిని జగన్ ఆత్మరక్షణలోకి నెట్టేసినట్లు అభిప్రాయపడింది చానెల్. జగన్ పాలనపై ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేస్తున్న జనాలు పెద్దగా సానుకూలంగా స్పందించటం లేదట. పెన్షన్లు, వాలంటీర్ల వ్యవస్ధ లాంటివి జగన్ కు అతిపెద్ద సక్సెస్ గా చానల్ అభిప్రాయాపడింది. హోలు మొత్తం మీద జగన్ మీద జనాల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదని స్పష్టంగా బయటపడిందని ఎన్టీవీ చెప్పటం గమనార్హం.