Idream media
Idream media
బతికుంటే బలుసాకు తిని అయినా జీవించ వచ్చు కానీ.. ఆ మహమ్మారి బారిన పడకుండా ఉంటే చాలు అన్న ధోరణి అన్ని వర్గాల్లోనూ పెరుగుతోంది. స్వచ్చంధ లాక్ డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయి. బజార్లు మూత పడుతున్నాయి. ఆరంభం లో కంప్లీట్ లాక్ డౌన్ తో ప్రజలను కాపాడిన ప్రభుత్వాలు క్రమ క్రమంగా సడలింపులు ఇస్తూ వస్తున్నాయి. వ్యవస్థను ఎక్కువ కాలం స్తంభింప చేయడం సాధ్యం కాదు కాబట్టి అన్ లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి. త్వరలో అన్ లాక్ 2 కి కూడా సిద్దంగా ఉండాలని ఓ సమావేశం లో కేసిఆర్ అడిగిన ప్రశ్నకు గాను ప్రధాని మోడీ తెలిపారు.
సడలింపులతో కార్య కలాపాలు ప్రారంభమై ఆర్థిక అవసరాలు తీరుతున్నా.. ప్రజల ఆరోగ్య పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కరోనా తో పోరాటం చేస్తూనే జీవనం సాగించడం తప్పదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మరో సారి లాక్ డౌన్ ఆలోచన లేదని తేల్చి చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం వైరస్ విజృంభణ వేగంగా ఉన్న చోట్ల లాక్ డౌన్ లేదా కఠిన ఆంక్షలు విధిస్తూ వెళ్తున్నాయి.
తెలంగాణ లోని జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రాష్ట్రం మొత్తం మీద కరోనా కేసులు 12, 400 వరకు నమోదు అయితే… గ్రేటర్ పరిధిలో లోనే 8000 వరకూ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో.. మళ్లీ లాక్ డౌన్ ఊహాగానాలు తలెత్తాయి. అయితే అటువంటి ఆలోచన లేదని సీ ఎస్ సోమేష్ కుమార్ గతం లోనే ప్రకటించారు. భయ పడుతూ కూర్చుంటే పనులు కావని.. తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనా బారిన పాడకుండా ముందుకు వెళ్ళడం అలవాటు చేసుకోవాలని సూచించారు. కానీ కొందరి నిర్లక్ష్యం మూలంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
పరిస్థితి భయంకరంగా మారడంతో…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కరోనా వీర విహారం చేస్తుందనే విషయంలో సందేహం లేదు. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 774 కేసులు నమోదు అయ్యాయి. నాలుగు నెలల్లో ఇది రికార్డు స్థాయి లెక్క. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రజలు, వ్యాపారులు స్వచ్చంధ లాక్ డౌన్ కు పిలుపు ఇస్తున్నారు. హైదరాబాద్ లో ప్రముఖ బజారులన్నీ మూత పడ్డాయి.కరోనా కారణంగా జూలై 5 వరకూ వ్యాపారాలు మూసి వేస్తున్నట్లు ఆయా ట్రేడర్ ఆసోసియోషన్ లు ప్రకటించాయి.
సికింద్రాబాద్ జనరల్ బజార్, చార్మినార్ లాడ్ బజార్, పాట్ మన్డి గోల్డ్ బజార్… ఇలా ప్రముఖ వ్యాపార సముదాయాలు అన్నీ స్వచ్చందంగా మూత పడ్డాయి. ఇవే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది దుకాణ దారులు అదే దారిలో వెళ్తున్నారు. లాక్ డౌన్ ఆరంభంలో బతికుంటే బలుసాకు తిని అయినా జీవించ వచ్చు.. అన్న కేసిఆర్ మాటలను ప్రస్తుతం చాలా మంది తమకు అన్వయించుకొని కొన్ని రోజుల పాటు బజార్లకు దూరంగా.. కుటుంబాలకు దగ్గరగా బతకాలని నిర్ణయించుకున్నారు. త్వరలో దేశం మొత్తం ఇదే దిశగా వెళ్ళినా ఆశ్చర్య పోనవసరం లేదేమో..!