Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రవేశపెట్టిన వాలంటర్ వ్యవస్థ ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నదో దేశమంతా చూస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా సరికొత్తగా వాలంటరీ వ్యవస్థ విధానాన్ని ఏపీలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టింది. కరోనా వైరస్ నియంత్రణ కోసం సర్వేలు, ప్రజలకు ప్రభుత్వ సహాయం అందించడంలో వాలంటీర్లు ఎనలేని సేవలు చేస్తున్నారు. వాలంటీర్ల సేవలను జాతీయ మీడియా కూడా కొనియాడింది. ఈ వ్యవస్థను పలు రాష్ట్రాలు కూడా అమలు చేసే ఆలోచన చేస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒకరు, పట్టణ ప్రాంతాలు ప్రతి వంద కుటుంబాలకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించారు. ప్రస్తుతం 10,700 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ సర్కార్ తాజాగా అనుమతి మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 5,200, పట్టణ ప్రాంతాల్లో 5,500 చొప్పున వాలంటరీ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాలు మున్సిపల్ కమిషనర్లు వాలంటరీ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఈనెల 20వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. దరఖాస్తు విధానం, ఇంటర్వ్యూ సమయం తదితర వివరాలు రేపు సోమవారం విడుదల చేసే నోటిఫికేషన్ లో పొందుపరచనున్నారు. మే ఒకటి కల్లా ఈ నియామకాలు పూర్తి కానున్నాయి.
రాష్ట్రం మొత్తం మీద దాదాపు 2.80 లక్షల మంది వాలంటీర్లు సేవలందిస్తున్నారు. వీరికి అదనంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు ఇళ్ల వద్దకు వెళ్లి ఇస్తున్నారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరణ అనంతరం పథకాల లబ్ధి.. ఇంటికి వెళ్ళి వాలంటీర్లు ఇస్తున్నారు. ప్రభుత్వానికి అవసరమైన వివిధ సర్వేల తో పాటు ప్రతి నెల పింఛను వాలంటీర్లు డోర్ డెలివరీ చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో ఇప్పటికే మూడు సార్లు ఇంటింటి సర్వే చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి వివరాలన్నీ పక్కాగా సేకరించారు. ఆ వివరాల ఆధారంగా ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం, పప్పు, వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం కూడా వాలంటీర్లు లబ్ధిదారులకు అందించారు. రెడ్ జోన్ ప్రాంతాలలో ఇంటింటికీ రేషన్ డోర్ డెలివరీ చేస్తూ కరోనా పై పోరులో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.