iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ కు ఊహించని షాకులు

  • Published Mar 12, 2020 | 4:11 AM Updated Updated Mar 12, 2020 | 4:11 AM
టాలీవుడ్ కు ఊహించని షాకులు

ప్రపంచం మొత్తం కరోనా భయంతో వణికిపోతున్న వేళ దాని ప్రభావం సినిమా పరిశ్రమ మీద కూడా పడింది. ఇప్పటికే ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న కేరళలో ఈ నెలాఖరు దాకా థియేటర్లు మూసేశారు. ఇంకొన్ని చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అల్లు అర్జున్ మూవీ కోసం అక్కడే షెడ్యూల్స్ ప్లాన్ చేసిన సుకుమార్ కూడా ఇప్పుడు దీని వల్ల వాయిదా వేయాల్సిన పరిస్థితి. మరోవైపు వివిధ దేశాల్లో ఎంట్రీకి కరోనా వల్ల తీవ్రమైన ఆంక్షలు విధించడంతో పలు నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.

ఇప్పటికే ఆర్టిస్టుల కాల్ షీట్స్ తీసుకుని టికెట్లు బుక్ చేసుకున్న యూనిట్లు ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏం చేయాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నాయి. పోనీ పోస్ట్ పోన్ చేద్దామంటే బడ్జెట్ మీద దాని ఎఫెక్ట్ మాములుగా ఉండదు. పోనీ ఇక్కడే చేద్దామంటే మేకింగ్ పరంగా రిచ్ నెస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అందుకే మరోసారి లెక్కలు వేసుకుని ఓవర్సీస్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాలా లేక ఇంకేదైనా ప్రత్యాన్మాయం వెతుక్కోవాలా అనే దిశగా చర్చలు జరుగుతున్నాయి.

ఇది చాలదన్నట్టు ఇప్పుడు పరీక్షల సీజన్ టాలీవుడ్ కు కొత్త టెన్షన్ ఇచ్చింది. పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఎస్సి పరీక్షలు మార్చి 31కి వాయిదా పడి ఏప్రిల్ 17 దాకా కొనసాగనున్నాయి. ఈ గ్యాప్ లో రెండు క్రేజీ ప్రాజెక్టులు వి, రెడ్ లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని వాయిదా వేయాల్సిందిగా బయ్యర్ల నుంచి సదరు నిర్మాతల మీద ఒత్తిడి వస్తోందట. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంటే ఇంటిల్లిపాది థియేటర్లకు దూరంగా ఉంటారు. దాని వల్ల కనీసం రెండు వారాల పాటు క్రౌడ్స్ తగ్గిపోతాయి.

ఇప్పుడు బ్లాక్ బస్టర్ల ఫైనల్ రన్నే మహా అయితే మూడు వారాలకు మించడం లేదు. అలాంటిది సాహసం చేసి ఇప్పుడు పరీక్షల టైంలో విడుదల చేసినా వసూళ్ల పరంగా ఇబ్బందులు తప్పవు. ఇంకొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు. మొత్తానికి కరోనా, పరీక్షల రూపంలో టాలీవుడ్ కు సరికొత్త సవాళ్లు ఎదురయ్యాయి. కరోనా ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో లేనప్పటికీ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం వల్ల జనం అవసరానికి మించిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ రెండు ఇబ్బందులను అధిగమించేలా షూటింగులు, విడుదల వాయిదాలకు స్పష్టమైన ప్రకటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.