iDreamPost
android-app
ios-app

ఇక నుంచి సరి‘హద్దులు’ లేవు

ఇక నుంచి సరి‘హద్దులు’ లేవు

కరోనా వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ ఈ రోజు ఐదో దశలోకి చేరింది. ఈ రోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ ఐదో దఫా లాక్‌డౌన్‌ కొనసాగనుంది. ఇప్పడు ఉన్న వాటితోపాటు మరిన్ని అంశాలకు లాక్‌డౌన్‌ నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. కేవలం కంటైన్‌మెంట్‌ జోన్లకే లాక్‌డౌన్‌న పరిమితం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో జోన్ల వ్యవస్థను పూర్తిగా ఎత్తివేశారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్‌ చేస్తూ వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు.

ఐదో దఫా లాక్‌డౌన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల్లో రవాణా వ్యవస్థ ముఖ్యమైనది. నాలుగో విడత లాక్‌డౌన్‌లో స్థానికంగా ఆర్టీసీ సర్వీసులకు అనుమతి ఇచ్చిన కేంద్రం తాజాగా అంతర్రాష్ట సర్వీసులకు పచ్చజెండా ఊపింది. అయితే ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే వదిలేసింది. అంతేకాకుండా అంతర్రాష్ట్రాల మధ్య ప్రయాణం చేసేందుకు పోలీసులు జారీ చేసే ప్రత్యేక పాస్‌లు అవసరం లేదని చెప్పింది. ఇప్పటి వరకూ ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రం వెళ్లాలంటే ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు లేదా డీజీపీ అనుమతి తప్పనిసరి.

తాజా సడలింపులతో తెలుగు రాష్ట్రాల మధ్య ప్రైవేటు వాహనాల్లో ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్వేచ్ఛగా వెళ్లవచ్చు. అంతర్రాష్ట్ర సర్వీసులు నడపడంపై మరో వారం పది రోజుల తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఉభయ రాష్ట్రాలు భావిస్తున్నాయి. పరిస్థితిని బట్టీ ఆర్టీసీ సర్వీసులు తిప్పాలని యోచిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ రోజు నుంచి హైదరాబాద్‌ నుంచి ఏపీకి, ఏపీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలనుకునే వారు తమ స్వంత వాహనాలతో రాకపోకలు సాగించవచ్చు.