ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామాలు – ‘మా’లో తీవ్రమైన విభేదాలు

ఇండస్ట్రీలో భయపడినట్టు, న్యూస్ ఛానల్స్ కోరుకున్నట్టు మా కుంపట్లు చల్లారలేదు. పైపెచ్చు పెరుగుతూనే ఉన్నాయి. మధ్యాన్నం నుంచి ప్రచారం జరుగుతున్న వార్తను నిజం చేస్తూ ప్రకాష్ రాజ్ గెలిచిన తన 11 సభ్యుల ప్యానెల్ తో ఇందాక ప్రెస్ మీట్ పెట్టి మూకుమ్మడి రాజీనామాలు ప్రకటించారు. బెనర్జీ మీద మోహన్ బాబు తీవ్రమైన మాటల దాడి చేయడాన్ని ఖండించిన ప్రకాష్ రాజ్ దాంతో పాటు తనీష్ ని దూషించిన ఉదంతాన్ని ప్రస్తావించి ఇలాంటి పదవుల్లో కొనసాగలేమని తేల్చి చెప్పారు. కౌంటింగ్ లో రౌడీయిజం జరిగిందన్న ప్రకాష్ రాజ్ ప్రశ్నించే తత్వం ఉన్న తమలాంటి వాళ్ళ వల్ల విష్ణుకి ఇబ్బంది రాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. బయటవాళ్ళు పోటీ చేయకూడదనేలా బైలాస్ మార్చకూడదని ప్రకాష్ రాజ్ కోరుతూ ఒకవేళ అలా చేయగలిగితే రిజిగ్నేషన్ వెనక్కు తీసుకుంటానని క్లారిటీ ఇవ్వడం గమనార్హం. ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న వారందరూ ఇంచుమించు ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు.

అనంతరం బెనర్జీ మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యారు. మోహన్ బాబు బూతులు తిడుతున్నా ఎవరూ ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విష్ణు. మనోజ్ లు తనను పక్కకు తీసుకెళ్లి వారించారని, దయచేసి బదులు చెప్పవద్దని కోరారని చెప్పారు. కానీ ఇంత నట జీవితంలో ఇలాంటి ఘోరమైన అవమానం ఎప్పుడూ జరగలేదని అందుకే మోహన్ బాబు సతీమణి ఫోన్ చేసి ఓదార్చినా తనవల్ల కాదని బెనర్జీ విపరీతమైన భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటిదాకా మా వ్యవహారంలో మాట్లాడని తనీష్ తానూ ఈ పదవిలో కొనసాగలేకపోవడానికి కారణం వివరించారు.తన తల్లిని దూషించడం పట్ల తనీష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వేదిక మీద అనసూయ, శివారెడ్డి, తదితరులు ఉన్నారు. వీళ్ళ కన్నా ముందు శ్రీకాంత్ మాట్లాడుతూ ఇకపై అసోసియేషన్ వ్యవహారాల్లో తన ప్రమేయం ఉండబోదని మా మంచికే రిజైన్ చేయాల్సి వస్తోందని స్పష్టం చేశారు.

కౌంటింగ్ సందర్భంగా జరిగిన గొడవలను తను కూడా ప్రస్తావించారు. ఉత్తేజ్ మాట్లాడుతూ గతంలో నరేష్ నాటకాల సందర్భంగా చూపించిన ప్రవర్తన గురించి, అతని వల్ల కలిగిన నష్టం గురించి ఏకరువు పెట్టారు. టీవీ కం సినిమా నటుడు ప్రభాకర్ సైతం కౌంటింగ్ రోజు రాత్రి ఈసి బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్లడం గురించి ప్రశ్నిస్తే తనకు విష్ణు వల్ల జరిగిన అవమానం వివరించారు. మోహన్ బాబు ప్రవర్తన గురించే తనూ నొక్కి చెప్పడం గమనార్హం. తాము పదవులకు మాత్రమే రాజీనామా చేశామని అసోసియేషన్ కి కాదని నొక్కి చెప్పడం విశేషం. కౌశిక్, సమీర్ లు తమ అనుభవాలు వివరించారు. జీవిత మౌనంగానే ఉన్నారు. అయితే అనూహ్యంగా గత రెండు గంటలుగా న్యూస్ ఛానల్స్ లో ప్రచారం జరిగినట్టు ఆత్మా(ఆల్ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్) అనే వేరే సంఘం ప్రకటన లాంటిదేమీ జరగకపోవడం ఫైనల్ ట్విస్ట్. ఇక మంచు విష్ణు, మోహన్ బాబుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి

Also Read : మా కథలు అప్పుడే అయిపోలేదు

Show comments