iDreamPost
iDreamPost
ఏపీలో బీజేపీ నేతలకు విషయం బోధపడుతున్నట్టు కనిపించడం లేదు. రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీ పట్ల ఎలా స్పందించాలననది ఆపార్టీ నేతలకు అంతుబట్టడం లేదు. బీజేపీ అధిష్టానంతో సన్నిహితంగా మెలుగుతున్న జగన్ పై విమర్శలు గుప్పించాలా లేక ఏపీ ప్రభుత్వ విధానాలను సమర్థించాలన్నది వారికి స్పష్టత రావడం లేదు. బీజేపీలో కొందరు నేతలు జగన్ నిర్ణయాలతో తమకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటుండగా కొందరు నేతలు మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలకు మాత్రం ఈ పరిస్థితి మింగుడుపపడం లేదు. ఏ నాయకుడిని ఫాలో అవ్వాలన్నది అర్థం కావడం లేదు. దాంతో ఆంధ్రా కమలనాథులకు కొత్త కష్టం వచ్చినట్టు కనిపిస్తోంది.
వైఎస్సార్సీపీ, బీజేపీ మధ్య బంధం బలపడుతోందనే సంకేతాలు వస్తున్నాయి. కేంద్ర స్థాయిలో పెద్దలు జగన్ కి పూర్తి ఆశీస్సులందిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే రాజధాని విషయంలో తమ వైఖరిని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఇక మండలి రద్దు విషయంలో ముందడుగు వేస్తున్నట్టు చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాల రెండోదశ చివరి అంకంలో ఏపీ మండలికి మంగళికి పాడడం అనివార్యమనే అభిప్రాయం వినిపిస్తోంది. వాటితో పాటుగా ఇతర విషయాల్లో కూడా ఇరు ప్రభుత్వాల పెద్దల మధ్య సామరస్య వాతావరణం ఏర్పడుతోంది. చివరకు నేరుగా వైఎస్సార్సీపీకి ఎన్డీయేలో భాగస్వామ్యం కూడా దిశగా పరిణామాలున్నాయి.
ఇది ఏపీ బీజేపీ నేతలను సతమతం చేస్తోంది. వైఎస్సార్సీపీని తమ భాగస్వామిగా చూడాలా లేక ప్రత్యర్థిగా భావించాలా అన్నది బోధపడడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో స్థానిక నేతలకన్నా జాతీయ స్థాయి పెద్దలకే స్పష్టత ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో వైఎస్ జగన్ సర్కారు పట్ల ప్రజల్లో సానుకూలత చెక్కుచెదరలేదు. అదే సమయంలో టీడీపీ తీవ్రంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. దాంతో తొలుత టీడీపీ మీద గురిపెట్టడం ద్వారా ఏపీలో ప్రతిపక్ష స్థానం ఆక్రమించాలనే లక్ష్యంతో కేంద్రంలో బీజేపీ పెద్దలున్నారు. తద్వారా ఏపీలో ప్రస్తుతం జీరోగా ఉన్న పార్టీ ముందడుగు వేసే అవకాశాలున్నాయని అంచనాలు వేస్తున్నారు. కానీ ఏపీ బీజేపీలో కొందరు సంప్రదాయ నేతలతో పాటు ఇటీవల బీజేపీలో చేరి కీలక నేతలుగా ఉన్న వారిలో కొందరు టీడీపీ పట్ల పూర్తి సానుకూలతతో ఉన్నారు. టీడీపీ మీద పల్లెత్తు మాట అనుకుండా, ఆపార్టీ ఎజెండాను బీజేపీ ద్వారా నెరవేర్చాలనే లక్ష్యంతో సాగుతున్నారు. జగన్ మీద గురిపెట్టి చంద్రబాబుని పరిరక్షించే ప్రయత్నంలో ఉన్నారు. దాంతో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో బీజేపీ నేతల మధ్య భిన్నమైన అంచనాలున్నట్టు బాహాటంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి కారణంగానే ఏపీలో ఆపార్టీ బలపడే అవకాశాలను చేతులారా కోల్పోతున్నట్టుగా కొందరు భావిస్తున్నారు.
వర్తమాన రాజకీయాల్లో బీజేపీకి ఏపీలో స్పష్టమైన వైఖరి లేకపోవడంతో క్షేత్రస్థాయి నేతలు తీవ్రంగా సతమతం అవుతున్నారు. ప్రభుత్వం పట్ల సానుకూలత విషయంలో కేంద్రం తీరుని అనుసరించేలా జీవీఎల్ ను సమర్థించాలా..కన్నెర్ర చేస్తున్న కన్నా లాంటి నేతలను అనుసరించాలా అన్నది వారికి బోధపడడం లేదు. దాంతో బీజేపీ ఆశలకు రెక్కలొస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ పరిణామాలలో పార్టీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారుతుందనే అభిప్రాయం బలపడుతోంది.