iDreamPost
android-app
ios-app

బిజెపి నేతలతో భేటీపై నిమ్మగడ్డ వివరణ ఇవ్వాలి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు

బిజెపి నేతలతో భేటీపై నిమ్మగడ్డ వివరణ ఇవ్వాలి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ బిజెపి నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ల మధ్య సమావేశం జరిగినట్లు వార్త బయటకు వచ్చిందని, దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు, విమర్శలు వస్తున్నాయని మధు చెప్పారు.

ఈ అంశంపై ప్రజల్లో గందరగోళం ఏర్పడిందని, దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇవ్వాలని, ఎన్నికల కమిషనర్ విషయం వివాదంగా మారి కోర్టుకెక్కిన నేపథ్యంలో రమేష్ కుమార్ బిజెపి నాయకులను ప్రత్యేకంగా కలవడం అనేక అనుమానాలకు, అపోహలకు ఆస్కారం కలిగిస్తోందన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు ఎటువంటి అపోహలకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరించాల్సి ఉందని మధు అన్నారు.
 
నిజాయితీగా ఉండడమే కాదు.. అలా ఉన్నట్టు కూడా వ్యవహరించాలని విమర్శించారు. లేనిపక్షంలో ప్రజల్లో రాజ్యాంగ సంస్థల పట్ల విశ్వసనీయత దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. ‘‘నిమ్మగడ్డ రమేష్ కుమార్ బిజెపి నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ల మధ్య సమావేశం  జరిగినట్లు వార్త బయటకు వచ్చింది. ఈ అంశంపై ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరణ ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు.

కాగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టిడిపికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఈనెల 13న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బిజెపి నేత కామినేని శ్రీనివాస్తో రహస్యంగా భేటీ అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ఈ సమావేశం జరిగింది.

ఇక ఇందుకు సంబంధించిన వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా..  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సర్వీసు నిబంధనలు, పదవీ కాలాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్, కొత్త ఎన్నికల కమిషనర్‌గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లో సుప్రీం కోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొంది.