iDreamPost
android-app
ios-app

‘కొత్త’ జోడింపులు పని చేస్తాయా?

  • Published Jan 23, 2020 | 5:07 AM Updated Updated Jan 23, 2020 | 5:07 AM
‘కొత్త’ జోడింపులు పని చేస్తాయా?

స్టార్ హీరోల సినిమాలకు వసూళ్లు తగ్గినప్పుడు అభిమానులను మళ్ళీ ఆకర్షించడం కోసం, ప్రేక్షకులకు మరోసారి ఆప్షన్ ఇచ్చేందుకు ఎడిటింగ్ టేబుల్ లో తీసేసిన సీన్లు, పాటలు కలపడం కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. నిన్న సరిలేరు నీకెవ్వరు టీమ్ త్వరలో కొన్ని సన్నివేశాలను జోడించబోతున్నామని అవి చాలా హిలేరియస్ గా ఉంటాయని చెప్పారు. నిజానికి అవి అంత కామెడీ ఉన్న ఎపిసోడ్లే అయితే ముందే అలా కోతకు గురయ్యేవి కాదుగా. ఇప్పుడు ఇవి యాడ్ చేసినంత మాత్రాన జనం పొలోమని ఎగబడి సినిమాకు వెళ్ళిపోరు.

గతంలో శ్రీమంతుడుకి ఇదే టెక్నిక్ వాడితే పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. భరత్ అనే నేనుకు కూడా ఈ ఫార్ములా అప్లై చేయాలనీ చూశారు కానీ ఉపయోగం ఉండదని గుర్తించి యుట్యూబ్ లో పెట్టారు. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు వంతు వచ్చింది. నిజానికి మహేష్ సినిమాకు అల వైకుంఠపురములో నుంచి తీవ్రమైన పోటీ ఎదురయ్యింది. దానికి యునానిమస్ టాక్ రావడం ప్రభావమైతే చూపించింది. ఇది సంక్రాంతి సీజన్ కాకపోతే సరిలేరు వసూళ్లు ఇంకొంచెం తక్కువగా వచ్చేవన్న మాట వాస్తవం. అందుకే ఈ జోడింపులు తప్పడం లేదు.

గతంలో చూడాలని ఉంది లాంటి చిరంజీవి సినిమాలకు యాభై రోజుల తర్వాత పాటలు కలిపారు. ఆ టైంలో వర్క్ అవుట్ అయ్యింది కానీ ఇప్పటి ట్రెండ్ లో కష్టమే. అందుకే సైరాలో కూడా ఇదే చేద్దామనుకున్నారు కానీ ఎందుకో ఆ ఆలోచన మానుకున్నారు. ఫలితంగా చిరంజీవి . తమన్నాల మీద చిత్రీకరించిన పాట బయటికి రాలేదు. అసలే లెన్త్ లు పెరిగిపోయి ప్రేక్షకులు ఎక్కువ సేపు థియేటర్లలో కూర్చోలేని పరిస్థితిలో ఇలాంటి జోడింపులు అంతగా ఫలితాన్ని ఇవ్వవన్న మాట కాదనలేని నిజం.