iDreamPost
iDreamPost
దశాబ్దంన్నర కిందటి మాట. అప్పట్లో 2004 ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. మన రాష్ట్రంలో ఒకే నగరానికి చెందిన నలుగురు పార్లమెంట్ కి ఎన్నికయ్యారు. అప్పట్లో రాజమండ్రి ఎంపీగా గెలిచిన ఉండవల్లి అరుణ్ కుమార్, అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్, నాటి భద్రాచలం పార్లమెంట్ కి సీపీఎం తరుపున విజయం సాధించిన మిడియం బాబూరావు కూడా రాజమండ్రి వాసులే కావడం విశేషం. వారితో పాటుగా ఆ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నుంచి సమాజ్ వాదీ పార్టీ తరుపున విజయం సాధించిన జయప్రదది కూడా రాజమండ్రి జన్మస్థలం కావడం విశేషం. దాంతో రాజమండ్రి నుంచి నలుగురు పార్లమెంట్ కి ఒకేసారి ఎన్నిక కావడం రికార్డ్ గా మారింది.
ఇక ఇప్పుడు నెల్లూరు జిల్లాకి అలాంటి ప్రత్యేకత కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ జిల్లాకు చెందిన ఐదుగురు పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒకరు. ఆయనకు తోడుగా ఒంగోలు నుంచి విజయం సాధించిన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కూడా అదే జిల్లా వాసి కావడం విశేషం. ఈ ముగ్గరు లోక్ సభ సభ్యులతో పాటు ప్రస్తుతం వైఎస్సార్సీపీకి ఉన్న ఇద్దరు రాజ్యసభ సభ్యలు కూడా నెల్లూరు వాసులే. వారిలో విజయసాయిరెడ్డి తో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు.
ఇక త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో బీసీ కోటాలో నెల్లూరు జిల్లా నుంచి బీదా మస్తాన్ రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దాదాపుగా ఆయన పేరు ఖరారయినట్టు పలువురు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు కీలక నేతగా వ్యవహరించిన యాదవ సామాజికవర్గానికి చెందిన బీఎంఆర్ మొన్నటి ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ కండువా కప్పకున్నారు. ఇప్పుడు రాజ్యసభ రేసులో ముందున్నారు. విజయసాయిరెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉండడం, ఆర్థిక దన్ను, సామాజిక నేపథ్యం ఆయనకు ప్లస్ పాయింట్లుగా చెబుతున్నారు. దాంతో ఆయనకు కూడా జగన్ అవకాశం కల్పిస్తే నెల్లూరు కి చెందిన ఆరో ఎంపీ అవుతారు. ఇక ఆయనతో పాటుగా రాజ్యసభ సీటు ఆశిస్తున్న వారిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈసారి రెడ్డి కోటాలో అయోధ్య రామిరెడ్డి పేరు దాదాపు ఖాయం కావడంతో రెండేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో మేకపాటికి అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే నెల్లూరు పలువురు ఎంపీలకు నెలవు అవుతుందనడంలో సందేహం లేదు. అటు ఎగువ సభ, ఇటు దిగువ సభలో నెల్లూరు వాసులు చక్రం తిప్పే పరిస్థితి రావడం విశేషంగా కనిపిస్తోంది.