iDreamPost
android-app
ios-app

అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ లోకేష్‌ సెల్ఫ్‌ గోల్స్‌

అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ లోకేష్‌ సెల్ఫ్‌ గోల్స్‌

పరిపాలన, ఎన్నికల హామీల అమలులో విమర్శలకు తావులేకుండా పాలన సాగిస్తున్న వైఎస్‌ జగన్‌ సర్కార్‌ను ఎలాగైనా విమర్శించాలి, నష్టపరచాలన్న దుగ్ధతో ప్రతిపక్ష టీడీపీ అధినాయకులే వ్యవహరిస్తున్నారు. అసత్య ఆరోపణలు చేస్తూ తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. ఈ తంతు చంద్రబాబు నుంచి మొదలవగా ఆయన తనయుడు మాజీ మంత్రి లోకేష్‌ కు ఆదే దారిలో పయనిస్తున్నారు.

ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా..? అన్న చందంగా తండ్రి కొడుకుల వ్యవహారం నడుస్తోంది. ఏపీలో కరెంట్‌ బిల్లులు పెరగకపోయినా.. పెరిగాయని చెప్పేందుకు చంద్రబాబు, నారా లోకేష్‌లు పనికట్టుకుని అస్యత ప్రచారానికి దిగుతున్నారు. చంద్రబాబు నాయుడు తన ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఖాతాల్లో బిల్లులు పెట్టి.. బిల్లు మొత్తాలనే హైలెట్‌ చేసి, యూనిట్లు ఎంత వాడారన్న విషయాన్ని వదిలేయగా.. తాను మాత్రం తక్కువ తిన్నానా అంటూ.. నారా లోకేష్‌ తన తండ్రి కన్నా మరో అడుగు ముందే ఉన్నారు.

నారా లోకేష్‌ తన ట్విట్టర్, ఫేస్‌బుక్‌ పేజీలో రెండు కరెంట్‌ బిల్లులు ఉంచి.. బిల్లు మొత్తాలను హైలెట్‌ చేస్తూ.. లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు, ఆదాయం లేదు, కరెంట్‌ చార్జీలు సాధారణ కన్నా మూడు నాలుగు రెట్లు వచ్చాయి. వారు ఎలా చెల్లిస్తారు. షాకింగ్‌.. అంటూ పోస్టు పెట్టారు.

లోకేష్‌ పెట్టిన రెండు బిల్లుల్లో సర్వీస్‌ నంబర్‌ కనిపించకుండా రెండు కలిపి పోస్టు చేశారు. మొదటి బిల్లులో 2,269 రూపాయలు, రెండో బిల్లులో 6,148 రూపాయలు బిల్లు వచ్చినట్లు ఆ మొత్తాలని హైలెట్‌ చేశారు. చూసిన వారు నిజమే.. ఒక్కసారిగా రెండు రెట్లు బిల్లు పెరిగింది.. అనుకోకుండా ఉండరు. కానీ నిశితంగా పరిశీలిస్తే.. ఆ రెండు బిల్లులు ఒక్కరివి కావన్న సంగతి బోధపడుతుంది. రెండు వేర్వేరు బిల్లులు పెట్టి.. ఒక్కరివే అని లోకేష్‌ తన ట్విట్టర్, ఫేస్‌ బుక్‌ ఫాలోవర్స్‌ను వెర్రివెంగళప్పలను చేయాలని చూశారు.

సర్వీస్‌ నంబర్‌ కనపడకుండా ఆ రెండు బిల్లులు ఒకరివే అని చెప్పుందుకు తన తెలివిని ఉపయోగించిన లోకేష్‌.. బిల్లు చెల్లించాల్సిన తేదీలు ఒక్కటే ఉండడం మాత్రం గమనించకుండా సెల్ఫ్‌ గోల్‌ వేసుకున్నారు. ఆ బిల్లులు ఒక్కరివే అయితే.. రెండు బిల్లులు ఒకే తేదీ మే 26న చెల్లించాలని ఎందుకు ఉంటుంది..? అనే చిన్న లాజిక్‌ను మేధావి అయిన లోకేష్‌ మరచిపోయి ఎప్పటిలాగే ఏదో చేద్దామనుకుని, ఏదో చేసి.. సెల్ఫ్‌ గోల్‌ వేసుకున్నారు. నెటిజెన్లకు ట్రోల్‌ చేసే అవకాశం కల్పించారు.

అధికారంలో ఉన్నప్పటికి, ఇప్పటికి లోకేష్‌లో ఏ మార్పు రాలేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సమర్థుడైన నాయకుడిగా పెరు తెచ్చుకోవాలంటే.. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా పదునైన, నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలి. కానీ తప్పుడు ఆరోపణలు చేస్తే.. ఉన్న పేరు కాస్త గోదావరిలో కలవకమానదు.