iDreamPost
android-app
ios-app

ఈఎస్‌ఐ స్కాంతో అచ్చెన్నకు ఏం సంబంధం : లోకేష్‌

ఈఎస్‌ఐ స్కాంతో అచ్చెన్నకు ఏం సంబంధం : లోకేష్‌

మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈఎస్‌ఐ స్కాంలో ఏసీబీ అరెస్ట్‌ చేసిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడు కుటుంబాన్ని లోకేష్‌ పరామర్శించారు. కింజారపు ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతోందంటూ లోకేష్‌ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఈఎస్‌ఐలో అవినీతి జరిగితే అచ్చెం నాయుడుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. బలహీన వర్గాల నాయకుడిగా ఎదుగుతున్న అచ్చెం నాయుడును అణగదొక్కేందుకే కేసులు పెట్టారంటూ చెప్పుకొచ్చారు. సీనియర్‌ అయిన అయ్యన్నపాత్రుడుపై నిర్భయ కేసు పెట్టారంటూ వాపోయారు. ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన కూన రవికుమార్‌పై కూడా కేసులు పెట్టారని మండిపడ్డారు. పెళ్లికి వెళ్లిన యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పులపై కేసులు పెట్టారని వాపోయారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై అన్యాయంగా కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని లోకేష్‌ విమర్శించారు. రాజా రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలపై కూడా కేసులు పెడుతున్నారంటూ, వారందరికీ అండగా ఉంటామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని లోకేష్‌ హెచ్చరించారు.