iDreamPost
android-app
ios-app

బీహార్‌పై మోడీ, షాల కన్ను: నితీష్ కుమార్ చెక్ పెడతారా..?

బీహార్‌పై మోడీ, షాల కన్ను: నితీష్ కుమార్ చెక్ పెడతారా..?

ఓ వైపు కరోనా కేసులు ఐదు లక్షలు దాటాక మరణాల సంఖ్య 15 వేలకు దగ్గరగా ఉన్నది. ఈ నేపథ్యంలో ”ఎవరు ఏమనుకున్నా మాకేంటీ మాకు బీహార్‌ గద్దెపైనే దృష్టి” అన్నట్టుగా మోడీ,అమిత్‌ షాలు వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ కేంద్రంలో ఉన్న బిజెపి పెద్దలకు మాత్రం త్వరలో బీహార్‌లో జరగబోయే ఎన్నికలవైపే దృష్టి పెట్టారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను గద్దెదింపటానికి బిజెపి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు.

చివరకు కరోనా కాలంలో లాక్‌డౌన్‌ ఉన్న సమయంలో.. మధ్యప్రదేశ్‌లో ఉన్న కాంగ్రెస్‌ సర్కార్‌ను కూల్చి..శివరాజ్‌సింగ్‌ను మరోసారి గద్దెపై కూర్చొపెట్టారు. మహారాష్ట్ర సర్కార్‌ను ఎప్పుడైనా పడేస్తామనేలా సంకీర్ణంలో మధ్య చిచ్చుపెడుతూనే ఉన్నారు.

ఇపుడు వారిద్దరూ బీహార్‌ రణం వైపు చూస్తున్నారు. అయితే హడావుడిగా ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా బీహార్‌లోని వలస కార్మికులు పడిన కష్టాలు వర్ణనాతీతం. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు బీహార్‌కు చేరుకోలేదు. సుప్రీం ఆదేశాలిచ్చినా…బీహారీలు ఆయా రాష్ట్రాల్లో నానా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో గుర్రుగా ఉన్న ఓటరన్నను ఆకట్టుకోవటానికి బిజెపి గాలం వేస్తున్నది. మొదటగా బీజేపీ ఆన్‌లైన్‌ ఎన్నికల ప్రచారానికి దిగింది.

కమలం పార్టీ నేతలు బీహార్‌లో ప్రజలకు చేరువకావడానికి ఈవెంట్లలో తలమునకలయ్యారు. సామాజిక మాధ్యమాల్లో నిర్వహిస్తున్న సభల్లో సంకీర్ణ ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరువు పెడుతున్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఆధ్వర్యంలోని జెడియుతో ఉన్న బిజెపి ఎత్తులకు తెరదీసింది.

సంకీర్ణం సిఎం నితీశ్‌ అంటూనే.. తెర వెనుక రాజకీయాలు చేస్తున్నదనీ జెడియు వర్గంలో వినిపిస్తున్న టాక్‌. నాణానికి మరోవైపు..వెనుకబడిన రాష్ట్రంగా పేరున్న బీహార్‌లో వలస కార్మికుల గోస పట్టించుకోని బిజెపి.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో…వారిని ఆదుకుంటామంటున్నది.

వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డును ప్రవేశపెట్టినా..అది వలస కార్మికులకు ఉపయోగపడలేదు. తాజాగా వలస కార్మికులను ఆదుకోవడానికి, వారికి గ్రామాల్లోనే పని కల్పిచేందుకు ఉద్దేశించిన ”గరీబ్‌ కళ్యాణ్‌ రోజ్‌గార్‌ యోజన”నూ మోడీ బీహార్‌ నుంచే ప్రారంభించారు. ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో చేపట్టబోయే ఈ పథకాన్ని బీహార్‌లోని కటిహార్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా మోడీ.. నగరాల నిర్మాణంలో వలస కూలీల పాత్ర ఎంతైనా ఉన్నదనీ, వారిని ఆదుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సెలవిచ్చారు. కార్మికులను మచ్చిక చేసుకునీ, వారి ఓట్లు రాబట్టడానికే మోడీ ఉద్దేశపూర్వకంగానే ఆ పథకాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించారని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, యుపిలను ఈ పథకంలో చేర్చిన బిజెపి ప్రభుత్వం.. వలస కార్మికులు అధికంగా ఉన్న బెంగాల్‌ను మాత్రం చేర్చకపోవడం వెనక మతలేబంటని ఆ రాష్ట్ర నాయకులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.

తాము చెప్పినట్టు నడుచుకుంటే సరే…లేకపోతే డబ్బులు..బెదిరించో..భయపెట్టో అధికారాన్ని బిజెపి తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటున్న ఉదంతాలెన్నో…తాజాగా బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు చెక్‌ పెట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తుందా..! అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

గత ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసివెళ్లిన నితీశ్‌.. మధ్యలో ఆ రెండు పార్టీల నుంచి బయటకొచ్చి…బిజెపితో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయితే పలు విభేదాలు ఉన్నప్పటికీ ఆయన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపితోనే కలిసివెళ్లారు.

ప్రస్తుత పరిస్థితుల్లో నితీశ్‌ ప్రతిష్ట కొద్దికాలంగా మసకబారుతున్నది. అంతేగాక ఆయన్ను ఇరుకున పెట్టడానికి కేంద్రం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నదనేది విశ్లేషకుల మాట. దీంతో ఆయన ఒంటరిగా వెళ్లలేక..ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేని స్థితికి వచ్చారు. ఇదే అదునుగా భావిస్తున్న బిజెపి కేంద్ర నాయకత్వం.. బీహార్‌ను తన గుప్పెట్లోకి తీసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నది. జెడియు ఇంకా అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికంటే ముందే బీజేపీ అక్కడ ఒంటరిగా ఎదగడానికి యత్నిస్తున్నది.

ఎన్నికలు రాగానే గుర్తుకొచ్చామా..అంటూ బీహార్‌ ఓటర్‌ కన్నెర్ర చేస్తున్నాడు. లాక్‌డౌన్‌తో రోడ్డునపడ్డప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. గుజరాతీయులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుంటే..వారిని తరలించటానికి లగ్జరీ బస్సులు వేశారు. మేం ఏం తప్పుచేశామని బీహారీలు మోడీ,అమిత్‌ షాలను ప్రశ్నిస్తున్నారు. బీహార్‌లో బిజెపి ప్రచారాలు..మోడీ పథకాలతో ఓటర్లను ఆకట్టుకునేలా చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామనీ,తమ ఓటును వజ్రాయుధంలా కమలంపై ఎక్కుపెడతామని మెజార్టీ ఓటర్లు అంటున్నారు. మరీ బీహార్‌ ఓటర్‌ తీర్పు ఎలా ఉంటుందో తేలాలంటే మరో రెండు నెలలు పాటు ఓపిక పట్టక తప్పదు.