iDreamPost
iDreamPost
తెలుగువాడి ఛాతి గర్వంతో ఉప్పొంగిపోయే విజయంలో ఆర్ఆర్ఆర్ మొదటి మెట్టు ఎక్కేసింది. కోట్లాది ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా లైవ్ చూస్తుండగా ప్రకటించిన నామినేషన్లలో నాటు నాటు చోటు దక్కించుకుంది. ఎంఎం కీరవాణి పేరుతో పాటు సాహిత్యం సమకూర్చిన చంద్రబోస్ నామధేయం కూడా ఇంటర్నేషనల్ స్టేజి మీద కనిపించం అద్భుత క్షణంగా చెప్పుకోవాలి. అయితే నాటునాటుకి పోటీ అంత సులభంగా ఉండటం లేదు. ఇదే విభాగంలో చాలా తీవ్రమైన కాంపిటీషన్ రాజమౌళి బృందానికి పెద్ద సవాల్ గా నిలవనుంది
టెల్ ఇట్ లైక్ ఏ విమెన్, టాప్ గన్ మావెరిక్, బ్లాంక్ పాంథర్ వాకండ ఫరెవర్, ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ అట్ వన్స్ లాంటి ఇంటర్నేషనల్ అక్లైమ్డ్ మూవీస్ రేస్ లో ఉండటం ట్రిపులార్ కు ఎదురయ్యే వ్యూహాన్ని క్లిష్టంగా మారుస్తున్నాయి. పైగా అన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పాటలే కావడంతో ఓటింగ్స్ తో పాటు అకాడెమి సభ్యుల పరిశీలన విశ్లేషణ కీలకంగా మారనుంది. గోల్డెన్ గ్లొబ్ సాధించాక నాటు నాటు మీద మనకే కాదు యుఎస్ యుకె లాంటి విదేశాల మీడియాకు కూడా ఆస్కార్ వస్తుందన్న నమ్మకం పెరిగింది.
మరి ఇంత పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఏ మేరకు నిలబెట్టుకుంటుందో చూడాలి. ట్విట్టర్ లో ఆల్రెడీ నాటు నాటు మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. కెరీర్ మొదలుపెట్టిన ముప్పై ఏళ్ళ తర్వాత కీరవాణికి దక్కిన అద్భుత గౌరవమిదని చెప్పాలి. గతంలో ఎందరో దిగ్గజాలకు సైతం సాధ్యం కానీ అరుదైన ఘనతను అందుకోవడానికి కేవలం అడుగు దూరంలో ఉన్నారు. ఈయన కంటే ఓ ఎనిమిదేళ్లు కెరీర్ ఆలస్యంగా మొదలుపెట్టిన చంద్రబోస్ కు సైతం ఇది తీవ్ర ఉద్వేగం కలిగించే విషయం. మరి విజేతలుగా నిలుస్తారో లేదో ఇంకో రెండు నెలలు వేచి చూడాలి. వచ్చినా రాలేకపోయినా ఇక్కడి దాకా వెళ్లడం మాత్రం టాలీవుడ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది.
This year's Original Song nominees are music to our ears. #Oscars #Oscars95 pic.twitter.com/peKQmFD9Uh
— The Academy (@TheAcademy) January 24, 2023