iDreamPost
android-app
ios-app

కీరవాణి కీర్తి సిగలో విరబూసిన పద్మం

  • Published Jan 26, 2023 | 10:10 AM Updated Updated Jan 26, 2023 | 10:10 AM
కీరవాణి కీర్తి సిగలో విరబూసిన పద్మం

ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ పురస్కారంతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కించుకుని తెలుగువాడి విజయపతాకాన్ని అంతర్జాతీయ వీధుల్లో ఎగరేసిన సంగీత దర్శకులు ఎంఎం కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడం టాలీవుడ్ నే కాదు యావత్ సినీ ప్రేక్షకులను సంతోషంలో ముంచెత్తుతోంది. కేవలం రోజుల వ్యవధిలో ఇన్నేసి శుభవార్తలు వినాల్సి రావడం కుటుంబానికే కాదు ఫ్యాన్స్ ని అంతులేని ఆనందాన్ని కలిగిస్తోంది. లేట్ ఏజ్ లోనూ ఇంత గొప్ప ఖ్యాతిని అందుకుంటున్న కీరవాణి స్వరాలు ముప్పై ఏళ్లకు పైగా ఏ స్థాయిలో అలరిస్తున్నాయో ఇప్పటికీ ఎంతగా మెప్పిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం.

కీరవాణిది మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ ప్రస్థానం. 1990లో ఉషాకిరణ్ మూవీస్ మనసు మమత ద్వారా పరిశ్రమకు పరిచయమైన ఈ సుమధుర సంగీత కుసుమం తొలుత ఆ సంస్థలోనే అశ్విని, అమ్మ, పీపుల్స్ ఎన్ కౌంటర్ లాంటి వరస హిట్లు చేస్తారు. రామ్ గోపాల్ వర్మతో పరిచయం క్షణ క్షణం రూపంలో మొదటి మ్యూజికల్ హిట్ అందించింది. రాఘవేంద్రరావుతో చేతులు కలిపాక కీరవాణిలో అసలైన ప్రతిభ ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే 1992 నుంచి శుక్రమహర్దశ మొదలైంది. ఇళయరాజా, రాజ్ కోటిల ప్రభంజనంలో చిరంజీవికి ఘరానా మొగుడు లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇవ్వడం ద్వారా ఆయనలో మాస్ కంపోజర్ బయటికి వచ్చారు

అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు, ఘరానా బుల్లోడు, బొంబాయి ప్రియుడు, ముద్దుల ప్రియుడు ఇలా ఏది చూసుకున్నా ఫలితంతో సంబంధం లేకుండా అన్నీ అదిరిపోయే ఆల్బమ్స్. స్వర్గీయ ఎన్టీఆర్ చివరి కమర్షియల్ చిత్రం మేజర్ చంద్రకాంత్ కు ఇచ్చిన పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి. అన్నమయ్య కీరవాణి జీవితంలో మరో గొప్ప మలుపు. ఆధ్యాత్మిక సినిమాల్లో కొత్త చరిత్రకు నాంది పలికిన ఆ పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. దీంతో పాటు పెళ్లి సందడి టాలీవుడ్ లో అత్యధిక ఆడియో సేల్స్ జరిగిన ఆల్బమ్స్ టాప్ 5లో ఉన్నాయి. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆర్ఆర్ఆర్ దాకా రాజమౌళితో ప్రయాణం ఇప్పుడు ఆస్కార్ దాకా తీసుకొచ్చింది