iDreamPost
android-app
ios-app

జపాన్లో ఆర్ఆర్ఆర్ 100 రోజుల సంరంభం

  • Published Jan 28, 2023 | 5:28 PM Updated Updated Jan 28, 2023 | 5:28 PM
జపాన్లో ఆర్ఆర్ఆర్ 100 రోజుల సంరంభం

అసలు తెలుగు రాష్ట్రాల్లో వంద రోజుల సినిమాలు అపురూపమైన రోజుల్లో జపాన్ లో అది కూడా మన బాష నటీనటుల గురించి కనీస అవగాహన లేని చోట హండ్రెడ్ డేస్ పోస్టర్ పడటం కన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది. అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం శతదినోత్సవాలు జరుపుకునేవారు. సక్సెస్ మీట్లు గట్రా ఉండేవి కాదు. హిట్టు బొమ్మ అంటే కనీసం పధ్నాలుగు వారాలు ఆడితే అప్పుడు పబ్లిక్ ముందు గ్రాండ్ గా ఈవెంట్ చేసేవారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ నగరాల్లో వీటిని అంగరంగవైభవంగా చేసేవారు

ఘరానా మొగుడు లాంటి పెద్ద బడ్జెట్ తో మొదలుపెట్టి సూరిగాడు లాంటి చిన్న చిత్రాల దాకా వాటి తాలూకు కబుర్లు ఇంటర్ నెట్ లో వెతికితే బోలెడు ఉంటాయి. కానీ ఇదంతా గతం. ఇప్పుడంతా మహా అయితే నెల రోజుల ముచ్చట అంతే. కానీ రాజమౌళి ఈ ట్రెండ్ ని బ్రేక్ చేశాడు. ఆర్ఆర్ఆర్ జపాన్ లో డైరెక్ట్ గా 42, షిఫ్టింగ్ స్క్రీన్లతో కలిపి 114 సెంటర్లలో 100 రోజులు ఆడేస్తోంది. కేంద్రాల వారీగా థియేటర్ల పేరుతో సహా దీనికి సంబంధించి అఫీషియల్ పోస్టర్ రిలీజైపోయింది. ఎస్ఎస్ రాజమౌళి అధికారికంగా షేర్ చేసుకున్నారు.

ఆర్ఆర్ఆర్ జపాన్ లో ముత్తు రికార్డుని బ్రేక్ చేసి నెంబర్ వన్ స్థానంలో కూర్చుంది. ఇంత రన్ తెచ్చుకున్న ఒకే ఒక ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది. ఈజీగా సిల్వర్ జూబ్లీ దాకా వెళ్లొచ్చనే అంచనా ఉంది. ఆస్కార్ లో చోటు దక్కించుకున్నాక ట్రిపులార్ క్రేజ్ అమాంతం రెట్టింపు అయ్యింది. ఖచ్చితంగా అకాడమీ అవార్డు వస్తుందనే అంచనాలు నెలకొన్న నేపధ్యంలో దీని బిగ్ స్క్రీన్ లో చూడాలనుకుంటున్న ప్రేక్షకులు ఎక్కువయ్యారు. ఈ కారణంగానే జపాన్ లో ఇటీవలే డాల్బీ విజన్ స్పెషల్ ప్రింట్ ని అప్గ్రేడ్ చేశారు