iDreamPost
iDreamPost
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుని తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న నందమూరి తారకరామారావు గారి మన మధ్య లేకపోయినా సినిమాల రూపంలో అందులో వేసిన పాత్రల ద్వారా సజీవంగా నిత్యం కళ్ళముందు మెదులుతూనే ఉంటారు. మూడు వందలకు పైగా సినిమాలతో మనం గర్వించదగ్గ ఎన్నో ఆణిముత్యాలు అందించిన ఎన్టీఆర్ గారి చివరి కమర్షియల్ చిత్రం మేజర్ చంద్రకాంత్. మోహన్ బాబు నిర్మాతగా కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్. ఎన్నో రికార్డులను తిరగరాసింది. రాజకీయాల్లోకి వెళ్ళిపోయాక ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ గారు నాలుగు సినిమాలు చేశారు.
సామ్రాట్ అశోక, బ్రహ్మర్షి విశ్వామిత్ర దారుణంగా ఫెయిలవ్వగా అన్నగారికి ఎలాగైనా చిరస్మరణీయమైన చిత్రం అందించాలనే ఉద్దేశంతో పరుచూరి బ్రదర్స్ తో మేజర్ చంద్రకాంత్ స్క్రిప్ట్ రాయించారు మోహన్ బాబు. ఆ వయసులో అలాంటి పవర్ ఫుల్ పాత్రను చేయగలరా అనే అనుమానాలకు చెక్ పెడుతూ అద్భుతంగా పోషించారు ఎన్టీఆర్. ముఖ్యంగా కీరవాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన పుణ్యభూమి నా దేశం నమోనమామి పాట ఊరు వాడా మార్మ్రోగిపోయింది. గణతంత్ర, స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో సంవత్సరాల తరబడి ఈ పాటనే ప్లే చేసేవారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే తన జీవితంలో కలగా మిగిలిపోయిన కొన్ని పాత్రల గెటప్స్ ని ఈ ఒక్క పాటలో పోషించారు.
ఇక్కడ పిక్ లో చూస్తున్నది వీరపాండ్య కట్టబొమ్మన వేషం. ఈ పాత్రతో పూర్తి నిడివి చేయాలని పలుమార్లు అనుకున్నప్పటికీ ఎన్టీఆర్ అది చేయలేకపోయారు. అప్పటిదాకా శివాజీ గణేశన్ నటించిన తమిళ డబ్బింగ్ సినిమానే ప్రజల మనస్సులో ముద్రించుకుపోయింది. కొన్ని షాట్సే అయినా నభూతో అన్న రీతిలో పండించారు ఎన్టీఆర్. మోహన్ బాబు దగ్గరుండి మరీ తాను లేని సీన్స్, పాటల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రాఘవేంద్ర రావు గారికి సహాయకులుగా నిలిచారు. ఇలా అందరి కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చింది మేజర్ చంద్రకాంత్. దీని తర్వాత శ్రీనాథ కవిసార్వభౌమ చేసిన ఎన్టీఆర్ దాని ద్వారా మాత్రం ఆశించిన ఫలితం అందుకోలేకపోయారు. అదే కెరీర్ మొత్తానికి ఆఖరి చిత్రంగా నిలిచిపోయింది. ఆ తర్వాత రెండేళ్లకులం కాలం చేశారు ఎన్టీఆర్. అయినా కూడా నందమూరి అభిమానులకు ఈ జ్ఞాపకాలు కలకాలం నిలిచి ఉంటాయి.