ముంబై చిక్కుల్లో ‘మేజర్’ టాస్క్

క్షణంతో సర్ప్రైజ్ హిట్ కొట్టి ఆపై గూఢచారి, ఎవరులతో దాన్ని మించిన సక్సెస్ తో తన మీద ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి పెరిగేలా చేసుకున్న అడవి శేష్ కొత్త సినిమా మేజర్. సోనీ సంస్థతో మహేష్ బాబు కొలాబరేట్ అయ్యి తీస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఇది. ముంబై 26/11 ఎటాక్స్ ని ఆధారంగా చేసుకుని మేజర్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటిదాకా సగమే పూర్తయ్యింది. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఆగస్ట్ 15 విడుదల చేసేందుకు టీమ్ పక్కా ప్లానింగ్ తో ఉంది. కానీ కరోనా వల్ల అంతా తారుమారైపోయింది.

కీలక భాగం ముంబైలో షూట్ చేశారు. బాలన్స్ కూడా అక్కడే పూర్తి చేయాలి. కానీ ఇప్పుడు ముంబై పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. దేశం మొత్తం మీద కొరోనా తీవ్రత ముంబైలోనే ఎక్కువగా ఉంది. ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసినా భవిష్యత్తులో ఆంక్షలు చాలా కఠినంగా ఉంటాయి. బయటి షూటింగులకు అనుమతులు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ వేచి చూద్దామంటే విడుదల వచ్చే ఏడాదికి వెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలో పరిస్థితి కుదుటపడ్డాక మేజర్ మిగిలిన భాగం హైదరాబాద్ లోనే చిత్రీకరించేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. ముంబైని పోలిన లొకేషన్స్ హైదరాబాద్ లో చాలా ఉన్నాయి.

ఒకవేళ అలాంటివి దొరక్కపోతే గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ ఉపయోగించి బడ్జెట్ ఎక్కువైనా అనుకున్న టైంలోనే పూర్తి చేయాలనుకుంటున్నారని తెలిసింది. మొత్తానికి కథ ప్రకారం మేజర్ కథ మొత్తం ముంబైలోనే జరగడం ఇప్పుడు ఆ యూనిట్ కు సమస్యగా మారింది. దర్శకుడు శశి కిరణ్ తిక్క చాలా టైట్ స్క్రీన్ ప్లే తో ఇంతకు ముందు ఇదే బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలకు భిన్నంగా మేజర్ ని చాలా పకడ్బందీగా రూపొందించినట్టు వినికిడి. సినిమా పరిశ్రమ మొత్తం సంక్షోభంలో కూరుకుపోతున్న వేళ ఇది ఒక్క మేజర్ యూనిట్ సమస్య మాత్రమే కాదు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు నిర్మాతల ప్లానింగ్స్ దారుణంగా డిస్టర్బ్ అయ్యాయి. భవిష్యత్ ని ఎవరూ కనీసం ఊహామాత్రంగానూ చెప్పలేకపోతున్నారు. అడవి శేష్ మేజర్ మీద చాలా అంచనాలు పెట్టుకున్నాడు. యాక్టర్ గా తన స్థాయిని పెంచే సినిమా అవుతుందని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

Show comments