iDreamPost
android-app
ios-app

సడలింపులు షురూ, మే 3 తర్వాత మరిన్ని…

  • Published Apr 30, 2020 | 3:37 AM Updated Updated Apr 30, 2020 | 3:37 AM
సడలింపులు షురూ, మే 3 తర్వాత మరిన్ని…

దేశంలో గతం ఎన్నడూ చూడని ఓ ప్రత్యక్ష అనుభవాన్ని చూడాల్సి వచ్చింది. సుదీర్ఘకాలం లాక్ డౌన్ తో మొత్తం వ్యవస్థ స్తంభించగా వివిధ వర్గాలు పలు అవస్థలు ఎదుర్కొన్నాయి. అందులో కొందరు వలస కూలీలు ప్రాణాలు కోల్పోగా, వివిధ తరగతులు మళ్లీ ఎప్పటికీ కోలుకుంటామోననే సందిగ్ధంలోకి నెట్టబడ్డారు. అలాంటి 4 రోజుల లాక్ డౌన్ ముగింపు దశకు వచ్చింది. తొలి విడత, రెండో విడత గడువు ముగుస్తున్న తరుణంలో ప్రభుత్వం తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. దానికి అనుగుణంగా క్రమంగా సడలింపుల ప్రక్రియ షురూ అవుతోంది.

వాస్తవానికి తొలి విడత లాక్ డౌన్ తోనే సరిపెట్టాలని ఏపీ ప్రభుత్వం సహా పలువురు కోరుకున్నారు. కానీ కేంద్రం దానికి భిన్నంగా ఆలోచించింది. కానీ చివరకు ఏప్రిల్ 20 నుంచి కొంత సడలింపులు మొదలుపెట్టింది. ఇక రెండోవిడత లాక్ డౌన్ ని కొనసాగించాలనే వారు కూడా ఉన్నారు. ఇప్పటికే మే 7 వరకూ అంటూ తెలంగాణా, మే 17 వరకూ పంజాబ్ లో లాక్ డౌన్ పొడిగించారు. అయితే కేవలం లాక్ డౌన్ కారణంగా విస్తృతి తగ్గడమే తప్ప, ఇతర ప్రయోజనాలు కనిపించకపోవడంతో సడలింపు కోసం డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా వలస కూలీల సమస్య పెరుగుతున్న తరుణంలో ప్రత్యామ్నాయాల వైపు అంతా చూస్తున్నారు.

ఇండియాలో ఇప్పటికీ వెయ్యి వరకూ మాత్రమే మరణాలున్నాయి. కానీ ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో 25వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా ఆయా దేశాల్లో లాక్ డౌన్ నుంచి సడలింపు ప్రకటించాయి. ఇక స్వీడన్ వంటి దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించనే లేదు. రష్యా సహా అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు వస్తున్నప్పటికీ మరణాలుని నివారించేందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుని లాక్ డౌన్ మినహాయింపులు మొదలుపెట్టారు. ఈ అనుభవాలతోనే ఇప్పుడు మన దేశంలో కూడా లాక్ డౌన్ విషయంలో కేంద్రం పునరాలోచన చేసినట్టు కనిపిస్తోంది. పలు సడలింపులకు క్రమంగా చర్యలు తీసుకుంటోంది.

ఇప్పటికే గ్రీన్ జోన్లలో ఆంక్షలు సడలించారు. తాజాగా వలసకూలీల ప్రయాణాలకు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. వాటితో పాటుగా అనేక వ్యాపార, పారిశ్రామిక సంస్థలు తెరుచుకునేందుకు సిద్ధం చేశారు. కేవలం రెడ్ జోన్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలతో కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్నారు. తద్వారా వ్యవస్థను మళ్లీ గాడిలోకి తీసుకొచ్చే యత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. లాక్ డౌన్ నేరుగా ఎత్తివేస్తన్నట్టు ప్రకటించకుండానే, సడలింపులు మరిన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. తద్వారా ప్రజల్లో భౌతిక దూరం, మాస్కుల వంటి జాగ్రత్తలు సహా అనేక రక్షణ చర్యలు కొనసాగించాలనే సూచనలు వెళతాయని ఆశిస్తున్నారు. ఇక మాల్స్, సినిమా థియేటర్లు, విద్యాసంస్థలతో పాటుగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పునరుద్దరణ కూడా కొంత ఆలశ్యమయ్యే అవకాశం ఉంది. విద్యాసంస్థల పరీక్షలకు సంబంధించి మే 15 తర్వాత స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే నీట్ క్లారిటీ లేదు. సివిల్స్ మే 30న జరగాల్సి ఉండగా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో పదో తరగతి పరీక్షలు కూడా అలానే ఉన్నాయి. ఇంకా అనేక పోటీ పరీక్షల విషయంలో కూడా మే మధ్య నాటికి నిర్ధిష్టమైన సమాచారం రావచ్చని భావిస్తున్నారు.

రాబోయే వారంలో మరిన్ని సడలింపుల మూలంగా సాధారణ జనజీవనానికి కొంత ఆటంకాటు తొలిగే అవకాశం ఉంది. కానీ ఏపీలో మాత్రం కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం మరిన్ని రోజుల పాటు పూర్తి స్థాయి ఆంక్షలు కొనసాగడం అనివార్యంగా కనిపిస్తోంది.