iDreamPost
android-app
ios-app

లాక్ డౌన్ సడలింపు..కొత్త అనుమతులు

లాక్ డౌన్ సడలింపు..కొత్త అనుమతులు

దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణ కోసం రెండు విడతలుగా 40 రోజులపాటు విధించిన లాక్‌డౌన్‌తోకూడా వైరస్ వ్యాప్తి అదుపులోకి రాలేదు. పలు రాష్ట్రాలలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు గంటగంటకూ పెరుగుతూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో మరో 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ మరోసారి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మే 17 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ ఈరోజు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.సామాన్యులకు,దినసరి కూలీలకు కొంత ఊరటనిస్తూ ప్రస్తుతం ఉన్న మినహాయింపులకు తోడు మరికొన్ని సడలింపులు గ్రీన్,ఆరెంజ్ జోన్‌లలో వారికి ఇచ్చారు.

కేంద్రం తాజాగా విడుదల చేసిన సడలింపులు మార్గదర్శకాలు ఇవే…

  • గ్రీన్‌,ఆరెంజ్ జోన్‌లలో సాధారణ దైనందిత కార్యకలాపాలకు అనుమతి.

  • గ్రీన్‌ జోన్‌లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు

  • గ్రీన్,ఆరెంజ్ జోన్‌లలో మద్యం విక్రయాలను సామాజిక దూరం పాటిస్తూ ఒకసారి 5 మందిని మాత్రమే అనుమతించి అమ్మకాలు సాగించవచ్చు.

  • గ్రీన్,ఆరెంజ్,రెడ్ జోన్‌లలో ఆస్పత్రులలో అవుట్ పేషెంట్‌ల సేవలకు అనుమతి.హాట్ స్పాట్ ప్రాంతాలలో సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ను ఉపయోగించడం తప్పనిసరి.

  • గ్రీన్, ఆరెంజ్ జోన్‌లలో నిత్యావసరాలు, ఔషధ రంగం,వైద్య పరికరాలు, ఐటీ,హార్డ్‌వేర్,జ్యూట్ ఇండస్ట్రీ పరిశ్రమల నిర్వహణకు నిబంధనలతో అనుమతి.

  • భవన నిర్మాణ రంగంలో సామాజిక దూరం పాటిస్తూ కొద్ది మంది కార్మికులతో నిర్మాణాలు చేపట్టవచ్చు.

  • గ్రీన్,ఆరెంజ్ జోన్‌లలో ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా,కాల్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజీలలో కార్యకలాపాలకు అనుమతి.

  • రాష్ట్రాల పరిధిలో గ్రీన్ జోన్‌లలో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో బస్సులు నడుపుటకు అవకాశం కల్పించారు.

  • ఆరెంజ్‌,గ్రీన్‌ జోన్‌లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి. కార్లలో డ్రైవర్ కాక ఇద్దరు ప్రయాణించవచ్చు.టూ వీలర్‌ మీద ఒక్కరు మాత్రమే ప్రయాణించాలి.

  • ఆరెంజ్,గ్రీన్ జోన్‌లలో రిక్షాలు,ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్ సేవలు,బస్సు సర్వీసులు, నడుపు కొనుటకు అనుమతించారు.

అయితే అన్ని జోన్‌లలో 65 ఏళ్ల పైబడిన వ్యక్తులు, పిల్లలు, గర్బిణులకు బయట సంచరించడానికి అవకాశం లేదు.అత్యవసర సేవల కోసం మాత్రమే బయటకు రావడానికి అనుమతి ఉంటుంది. అలాగే ప్రతి రోజు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అవసరమైన చోట్ల పగటి పూట కూడా 144 సెక్షన్ విధిస్తారు.

ఇక కంటెయిన్‌మెంట్ జోన్‌లలో ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి లేదు.రెడ్ జోన్‌లలో ఆటోలు, ట్యాక్సీలు,క్యాబ్ సేవలు, బస్సు సర్వీసులు నడపడంపై నిషేధం కొనసాగుతోంది.సెలూన్లు,స్పా సెంటర్ సేవలకు అనుమతి మరోసారి నిరాకరించారు.స్విమ్మింగ్‌ పూల్స్‌, స్టేడియంలు మూసివేతతో పాటు ప్రజలు గుమిగూడటానికి ఆస్కారం ఉన్న అన్ని రకాల ప్రార్థనా స్థలాలు, పబ్లిక్‌ ఈవెంట్ కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుంది.