iDreamPost
android-app
ios-app

మే 3 వరకు లాక్ డౌన్.. ప్రధాని మోదీ ప్రకటన..

మే 3 వరకు లాక్ డౌన్.. ప్రధాని మోదీ ప్రకటన..

దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. వైరస్ కట్టడికి లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఇతర దేశాల కన్నా దేశంలో కరోనా నియంత్రణ చర్యలు పటిష్టంగా చేపట్టామని పేర్కొన్నారు. ఇతర దేశాల కన్నా మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి 20- 30 శాతం తక్కువగా ఉందని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో తాను అర్థం చేసుకోగలనని వ్యాఖ్యానించారు.

”21 రోజుల లాక్ డౌన్ దేశం పటిష్టంగా అమలు చేసింది. దేశంలో ప్రతి ఒక్క పౌరుడు సైనికుడిగా కరోనా పై పోరాటం చేస్తున్నారు. కరోనాపై పోరాటం చేయడంలో దేశం మొత్తం ఒకే తాటిపై ఉంది. కరోనా మహమ్మారిగా మారకముందే దేశంలో నియంత్రణ చర్యలు చేపట్టాం. వైరస్ దేశంలో శరవేగంగా వ్యాప్తిచెందుతోంది. కరోనా పై పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. దేశంలో ఒక్క కరోనా కేసు నమోదు కాకముందే విదేశాల నుంచి వచ్చే వారిని స్క్రీనింగ్ చేసాం.” అని మోదీ పేర్కొన్నారు.

లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ ద్వారా మనం లాభపడ్డామని ప్రధాని మోడీ తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తామని ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్ తొలగించడం సాధ్యం కాదని మోడీ స్పష్టం చేశారు. కరోనా హాట్ స్పాట్ లు కాని ప్రాంతాలలో ఏప్రిల్ 20 తర్వాత సడలింపు ఉంటుందని మోడీ చెప్పారు. అప్పటి పరిస్థితిని సమీక్షించి, సడలింపు పై ఆలోచన చేస్తామని తెలిపారు.

మొత్తం మీద లాక్ డౌన్ ను మరో 19 రోజులు పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. గత నెల 24 వ తేదీ అర్ధరాత్రి నుంచి దేశంలో లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన మేరకు ఈరోజు ఏప్రిల్ 14వ తేదీతో లాక్ డౌన్ ముగిసిన నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ప్రాణాలకే మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. మే 3 తర్వాత పరిస్థితి సమీక్షించి లాక్ డౌన్ ఎత్తి వేత పై ఆలోచన చేస్తామన్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేందుకు రేపు బుధవారం మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు.