iDreamPost
iDreamPost
వైఎస్సార్సీపీ తరుపున లోక్ సభకి ప్రాతినిధ్యం వహిస్తున్న 22 మంది ఎంపీల్లో ఎక్కువ మంది యువ నేతలే. అందులోనూ తొలిసారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. దాంతో కొంత ఉత్సాహంగా కనిపించాల్సి ఉంటుంది. కానీ పరిస్థితి భిన్నంగా ఉంది. పార్లమెంట్ వ్యవహారాల్లో అనుభవం కోసం తొలినాళ్లలో ఎదురుచూసినా, ఏడాది గడుస్తున్న సమయంలో గేర్ మార్చాల్సి ఉంది. కానీ ఇప్పటికీ చాలామంది ఎంపీలు సైలెంట్ గా ఉంటున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. నియోజకవర్గ సమస్యలే గాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం హస్తినలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన దశలో చడీచప్పుడు లేకుండా సాగిపోతున్నారు.
అధికార పార్టీకి చెందిన వారిలో అత్యధికులు మొదటి సారి పార్లమెంట్ కి ఎన్నికయ్యారు. గతంలో పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహించిన వారిలో వంగా గీత, వల్లభనేని బాలశౌరి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఉన్నారు. ఇంతకుముందు సభలో సభ్యులుగా ఉన్న మిధున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి వంటి వారు కూడా వారికి తోడుగా ఉన్నారు. మిగిలిన నేతలంతా లోక్ సభ వ్యవహారాలకు కొత్తవారే. అందులోనూ రాజకీయాలకు కూడా కొత్త మొఖాలే. అదే సమయంలో యువనేతలు కూడా. అయినా వారంతా మంచి విద్యార్హతలతో , పలు భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉండడం ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడే అవకాశం ఉన్న వారు ఎక్కువగా ఉండడంతో ఢిల్లీలో కీలకంగా మారడానికి తోడ్పడుతుంది. అయినా కొందరు అందుకు విరుద్ధంగా సాగుతున్నారు.
ఎన్నికల తర్వాత ఇప్పటికే మూడు సార్లు పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. అయినా అనుభవం సంపాదించిన తర్వాత దానికి అనుగుణంగా ముందుకు సాగాల్సిన నేతలు ఇంకా దానికి తగ్గట్టుగా వ్యవహరించడం లేదు. ప్రస్తుతం సభలో సీనియర్లను మినహాయిస్తే మార్గాని భరత్, కనుమూరి రఘురామకృష్ణం రాజు వంటి నేతలు మాత్రమే కొంత ఆకట్టుకోగలుగుతున్నారు. లావు శ్రీకృష్ణదేవరాయులు వంటి వారు కొంత ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ అనేక మంది ఎంపీలు సభలో పెదవి విప్పడానికి కూడా సిద్ధపడడం లేదు. అదే సమయంలో మంత్రులు, కేంద్రంలో అధికార యంత్రంగం వద్ద మంత్రాంగం నెరపడంలో కూడా ఇంకా సంశయంతోనే సాగుతున్నట్టు కనిపిస్తోంది.
తొలిసారి రాజ్యసభకు ఎన్నికయిన నాటి నుంచి విజయసాయిరెడ్డి వ్యవహరించిన తీరు ఇక్కడ గమనార్హం. ఆయన ఇప్పటికే నేరుగా పీఎంవోలో ప్రవేశించే నేతల్లో ఒకరిగా మారారు. అలాంటి అనుభవం ఎదురుగా ఉన్నప్పటికీ కొత్త నేతలు కొంత దూకుడు చూపలేకపోతున్నారు. వివిధ కార్యాలయాల్లో పెండింగ్ లో ఉన్న ఏపీ వ్యవహారాల విషయంలో వేగంగా కదలడం లేదు. ఆర్థిక వ్యవహారాలు మినహాయిస్తే ఇతర సాంకేతిక అంశాల వంటి వాటిలో చొరవ చూపడం అత్యవసరంగా కనిపిస్తోంది. లేదంటే తగిన సంఖ్య ఉన్నప్పటికీ తగిన ప్రయోజనం దక్కడం లేదనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతుంది. అధికార పార్టీ నాయకత్వం కూడా వారిని అందుకు అనుగుణంగా సన్నద్ధం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.