Idream media
Idream media
ఒక వైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధిపై కూడా సమ ప్రాధాన్యత చూపిస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. లాక్‌డౌన్ వల్ల గత రెండు నెలలుగా మందకొడిగా సాగుతున్న పనులను పరుగులెత్తించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. కడప స్టీల్‌ప్లాంట్ పనులపై ఆయన సమీక్షించారు. ఉక్కు రంగంలో ప్రముఖుడు, సెయిల్ మాజీ సీఎండీ సీఎస్ వర్మతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై చర్చించారు. ఎలాంటి ఉత్పత్తులు చేస్తే డిమాండు ఉంటుంది? దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఎలా లభిస్తుంది? తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు. అలాగే ఉత్పత్తులకు అనుగుణంగా స్టీల్‌ప్లాంట్ నిర్మాణాన్ని ఎన్ని దశల్లో పూర్తి చేశాలన్నదానిపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రముఖ ఉక్కు తయారీ సంస్థల భాగస్వామ్యం కోసం జరపాల్సిన సంప్రదింపులపై సమావేశంలో చర్చ సాగింది. ప్రపంచంలో ప్రస్తుతం ఉక్కు రంగంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అన్న దానిపై విస్తృతంగా చర్చించారు.
ముడి ఖనిజం సరఫరా, రవాణా, ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై తన అభిప్రాయాలను సీఎస్ వర్మ.. ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్‌లో భాగస్వామ్య కంపెనీల కోసం ప్రయత్నిస్తూనే పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జాయింట్ వెంచర్ వచ్చేలోగా ప్లాంట్ కోసం ఎంపిక చేసిన ప్రాంతాన్ని నిర్మాణం కోసం సిద్ధం చేయాలని సూచించారు. దీనిపై దృష్టి పెడితే చాలా సమయం ఆదా అవుతుందన్నారు. ఇదే సమయంలో ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన అన్ని రకాల అనుమతులను వేగంగా తెచ్చుకోవాలని సీఎం పేర్కొన్నారు.
వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి వద్ద గతేడాది డిసెంబర్‌లో సీఎం జగన్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. దీనికి ఏపీ హైగ్రేడ్ స్టీ్‌ల్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా పేరు నిర్ణయించారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 250 కోట్లు కూడా కేటాయించారు. దాదాపు 15వేల కోట్ల వ్యయంతో మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఏడాదికి 30లక్షల టన్నుల సామర్థ్యంతో స్టీ్‌ల్‌ప్లాంట్‌ను నిర్మించనున్నారు. ఈ పరిశ్రమ పూర్తయితే జిల్లాలోని 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.
దీన్ని వేగంగా పూర్తి చేయడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు ఏపీ ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే ముడి ఇనుము సరఫరాకు కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకుంది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు నాలుగు ప్రైవేట్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. దక్షిణ కొరియా, జపాన్లతోపాటు భారత్‌కు చెందిన పలు కంపెనీలతో ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఆయా కంపెనీలు కొన్ని రాయితీలు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాయి. దీనిపై మరోదఫా చర్చలు జరిపి, ఏదో ఒక కంపెనీకి స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించిన 3,148 ఎకరాలను అప్పగిస్తారు.