Idream media
Idream media
వడ్డించే వాడు మనవాడైతే… అన్న సామెతను అక్షరాల నిజం చేస్తూ గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన పార్టీకి, తనునూయలకు ప్రభుత్వ భూములు కట్టబెట్టారు. పార్టీ కార్యాలయాలకు, సంస్థలకు భూములు కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి వాటిపై ప్రస్తుత జగన్ సర్కార్ దృష్టి పెట్టింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో టీడీపీకి రెండు ఎకరాలు కేటాయించారు. ఆ కేటాయింపులను రద్దు చేయాలని ఇప్పటికే జగన్‌సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు నేడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
చంద్రబాబు తన పార్టీకే కాదు తన పార్టీ వారికి, సన్నిహితులకు ప్రభుత్వ భూములు కేటాయించారు. మార్కెట్ ధర కంటే అత్యంత తక్కువకు ఇస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా కేటాయించిన భూములపై దృష్టి పెట్టిన జగన్ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా, తక్కువ ధరకు చేసిన కేటాయింపులను రద్దు చేస్తోంది.
సీఆర్‌డీఏ పరిధిలో బాలకృష్ణ వియ్యంకుడికి ఇచ్చిన 498 ఎకరాల భూ కేటాయింపులను ఇప్పటికే రద్దు చేసింది. అంతేకాకుండా లులూ కంపెనీకి విశాఖలో కేటాయించిన భూములను తిరిగి తీసుకుంది. తాజాగా టీడీపీకి ఇచ్చిన రెండు ఎకరాలను తిరిగి సంబంధిత ప్రభుత్వ శాఖకు బదిలీ చేస్తూ మంత్రివర్గం తీర్మానించింది. ఇలా వరుస నిర్ణయాలతో జగన్ సర్కార్ చంద్రబాబుకు షాక్ ఇస్తుండడం గమనార్హం.