iDreamPost
android-app
ios-app

కియా కరోనా సాయం రూ. 2 కోట్లు

కియా కరోనా సాయం రూ. 2 కోట్లు

రాష్ట్రంలో కరోనా విపత్తును ఎదుర్కోవడానికి ఆర్థిక సహాయం అందించేందుకు అనేక సంస్థలు, ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా అనంతపురంలో ఏర్పాటైన దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్‌ రూ. 2 కోట్ల సాయాన్ని ప్రభుత్వానికి ప్రకటించింది. ఆ సంస్థ ప్రతినిధులు గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి చెక్‌ను అందజేశారు. ప్రభుత్వానికి సహకారం అందించేందుకు ఎల్లప్పడూ సిద్ధంగా ఉంటామని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

సరిగ్గా రెండు నెలల కిందట ఏపీ నుంచి కియా తరలిపోతోందంటూ విపక్షాలు చేసిన దుష్ప్రచారాలు రాష్ట్రంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాము ఎక్కడికీ వెళ్లడం లేదంటూ, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సహకారం చాలా బాగుందంటూ ఒక పక్క ఆ సంస్థ చెప్పినా వినకుండా తప్పుడు వార్తలను కొనసాగించాయి. వాటన్నిటినీ పక్కన పెట్టిన కియా మోటార్స్‌ తమ ఉత్పాదకతపై దృష్టి సారించింది. కార్ల అమ్మకాలను ప్రారంభించిన తొలి రెండు నెలల వ్యవధిలోనే దేశంలోనే అతిపెద్ద మూడో కార్ల విక్రయ సంస్థగా రికార్డు సృష్టించింది. ఇదే ఉత్సాహంతో అనంతపురంలోని ప్లాంట్‌ను మరింత విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తన వంతు సాయం అందించింది. తద్వారా ఏపీ ప్రభుత్వంతో తమకున్న సాన్నిహిత్యాన్ని చెప్పినట్లైంది.