Idream media
Idream media
భారత్‌లో కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 386 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వల్ తెలిపారు. మొత్తం కేసులు 1500 దాటాయని చెప్పారు. ఢిల్లీలో జరిగిన జమాత్ కారణంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయని ఆయన వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 38 మంది మరణించారని తెలిపారు. మర్కత్ భవన్‌లో ఉన్న 2,300 మందిని అక్కడ నుంచి కేంద్ర బలగాలు ఖాళీ చేయించాయి. వారిలో దాదాపు 600 మందికి కరోనా లక్షణాలున్నాయని ప్రాథమికంగా నిర్థారించారు.
ఢిల్లీ జమాత్‌కు దేశం నలుమూలల నుంచి హాజరయ్యారు. గత నెల 14, 15 తేదీల్లో జరిగిన ఆ కార్యక్రమానికి ఇండోనేషియా, ఇరాక్ నుంచి వచ్చిన వారితో కలసి దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు ప్రార్థనలు చేశారు. అక్కడే కొద్ది రోజులపాటు ఉన్నారు. అక్కడ నుంచే దేశం మొత్తం కరోనా వ్యాపించిందని కేంద్ర ఆర్యోగశాఖ చెబుతోంది.
జమాత్‌కు వెళ్లిన వారిని గుర్తించి, వారికి వైద్య పరీక్షలు చేయించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. ఆ కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారిని ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వాలు.. వారికి వైద్య పరీక్షలు చేయిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు రెండు వేల మంది హాజరయ్యారని ప్రాధమికంగా నిర్థారణ అయింది. వీరి నుంచి ఇతరులకు సోకే అవకాశం ఉండడంతో.. వారికి సన్నిహితంగా ఉన్న వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కొద్దిసేపటి క్రితం సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.