iDreamPost
android-app
ios-app

జగన్ పాలన భేష్ .. బిజెపి సీనియర్ నేత

  • Published May 30, 2020 | 4:00 AM Updated Updated May 30, 2020 | 4:00 AM
జగన్ పాలన భేష్ ..  బిజెపి సీనియర్ నేత

ఏడాది జగన్మోహన్ రెడ్డి పరిపాలన భేష్షుగ్గా ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చెప్పటం గమనార్హం. కేంద్ర నాయకులేమో జగన్ పరిపాలనను అభినందిస్తుంటే రాష్ట్ర నాయకులు మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. జగన్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి వైపుగా వెళుతోందంటూ చెప్పాడు. ఇదే సమయంలో జగన్ పై బురద చల్లటమే టార్గెట్ గా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ యాగీ చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

ప్రధానమంత్రి-జగన్ మధ్య సత్సంబధాలు ఉన్న కారణంగా ఇద్దరు కూడా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారంటూ అభినందించాడు. అంటే జగన్ ను అభినందిస్తునే పనిలో పనిగా ప్రధానమంత్రిని కూడా మాధవ్ కలిపేశాడు. కేంద్రంలో మోడి తీసుకుంటున్న నిర్ణయాలకు వైసిపి ఎంపిలు మద్దతు తెలపటం అన్నీ విధాలుగా మంచి పరిణామమంటూ అభినందించాడు.

తిరుమల తిరుపతి దేవస్ధానం ఆస్తులను అమ్మే విషయంలో సాధుసంతులతో సంప్రదుంలు జరపాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పాడు. అక్కడక్కడ కొన్ని ఆరోపణలున్నా హోలు మొత్తం మీద జగన్ పాలనైతే భేష్ అంటూ అభినందించటం బహుశా కన్నా అండ్ కో మండిపోతుండచ్చు. రాష్ట్రాభివృద్ధి కోసమే మోడి, జగన్ కలిసి కృషి చేస్తున్నట్లు చెప్పాడు. నిజానికి రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుండి రావాల్సినంత సాయం అందటం లేదని జనాలు అసంతృప్తి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తం మీద జగన్ పాలన బాగుందని ప్రతిపక్ష బిజెపి కీలక నేత అభినందించటం మంచిదే కదా.