iDreamPost
iDreamPost
ప్రస్తుతం దేశంలో వలస కూలీల సమస్య అందరినీ కలచివేస్తోంది. పొట్ట పోసుకునేందుకు దూర ప్రాంతాలకు వెళ్లి లాక్ డౌన్ లో ఇరుక్కున్నవారు పడుతున్న అవస్థలు అన్నీ కావు. కడుపు నిండుపుకునే మార్గం లేక, ఆకలితో ఉండలేక ఖాళీ కడుపుతో కాలినడకన రాష్ట్రాలు దాటుతున్న దయనీయ దుస్థితి దేశమంతా దర్శనమిస్తోంది. ఏపీకి చెందిన లక్షల మంది కార్మికులు కూడా ఇదే పరిస్థితుల్లో ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. అలాంటి వారి పట్ల మానవత్వంతో స్పందించాలని జగన్ నిర్ణయించారు. దానికి అనుగుణంగా వారికి దారులు తెరిచేందుకు సన్నద్ధమవుతున్నారు..
ఇప్పటికే లాక్ డౌన్ రెండో దశ ముగింపునకు వస్తోంది. మూడో దశ కూడా అనివార్యంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరికొన్నాళ్లపాటు ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోతే చిక్కులు తప్పవని అంతా భావిస్తున్నారు. ఈ విషయాన్ని జగన్ దృష్టిలో పెట్టుకున్నారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గుజరాత్, మహారాష్ట్రలో ఇరుక్కుపోయిన మత్స్యకారుల కోసం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వలస వెళ్లిన వారిని సముద్రమార్గంలో తీసుకువస్తామని ఇప్పటికే ప్రకటించారు. అనుమతి కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అందుకు అనుగుణంగా వారి రవాణా ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ నుంచి నిధులు కూడా విడుదల చేయించిన జగన్ పెద్ద మనసు చాటుకున్నారు.
ఇక రాష్ట్రంలోనే వివిధ జిల్లాల్లోనే చిక్కుకున్న వారిని కూడా సొంత ప్రాంతాలకు చేర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందుకు తగ్గట్టుగా రవాణా శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. వివిధ జిల్లా అధికారులు వలస కూలీల వివరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత వారిని గ్రీన్ జోన్ నుంచి గ్రీన్ జోన్ కి యధావిధిగా ప్రత్యేక బస్సుల్లో తరలిస్తారు. గ్రీన్ జోన్ నుంచి రెడ్ జోన్ కి గానీ, రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ కి గానీ వెళ్లాల్సిన వారిని మాత్రం అనుమతించరు. ఇక వెళ్లడానికి అనుమతి పొందిన వలస కూలీలకు స్క్రీనింగ్ చేస్తారు. 60 ఏళ్ల వయసు పైబడి, ఆరోగ్య సమస్యలున్న వారికి పరీక్షలు కూడా చేస్తారు. వారి పరిస్థితిని బట్టి క్వారంటైన్ లో ఉంచాలా లేక తరలించాలా అన్నది నిర్ణయిస్తారు.
ఏమయినా ఇంకా ఎన్నాళ్ల పాటు తాము చిక్కుకుపోవాలోనని సతమతం అవుతున్న వేల మందికి ఇది పెద్ద ఊరట కల్పించే అంశంగా కనిపిస్తోంది. మానవత్వంతో కూడిన ముందుచూపుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం వల్లకొంత సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. ఈ పరిణామాలతో ఇప్పటికే కేంద్రం పెట్టిన నిబంధనలతో విలవిల్లాడుతున్న వారు మళ్లీ సొంత ఊళ్లకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతున్నట్టేనని చెప్పవచ్చు. సమీప తమిళనాడు, కర్ణాటకలో ఉన్న వారికి కూడా ఇదే పద్ధతిలో అవకాశం ఇవ్వాలని జగన్ సర్కార్ యోచిస్తోంది. ఆయా ప్రభుత్వాలతో సంప్రదింపులు ప్రారంభించింది