iDreamPost
android-app
ios-app

వైఎస్ జ‌గ‌న్ ఏడాది పాల‌న‌పై బిజెపిలో త‌లోమాటః జాతీయ నేత‌లు భేష్ అంటే..రాష్ట్ర నేత‌లు విమ‌ర్శ‌లు

వైఎస్ జ‌గ‌న్ ఏడాది పాల‌న‌పై బిజెపిలో త‌లోమాటః జాతీయ నేత‌లు భేష్ అంటే..రాష్ట్ర నేత‌లు విమ‌ర్శ‌లు

రాష్ట్రంలో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాది సంక్షేమ పాల‌న అందించారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల బ‌లోపేతానికి కృషి చేశారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుప‌డ్డారు. అనేక ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు వ‌చ్చిన వాటిని ప‌క్క పెట్టి ప్ర‌జా శ్రేయ‌స్సే ల‌క్ష్యంగా ముందుకు సాగారు. అవినీతి పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడారు. సామాజిక న్యాయానికి బాట‌లు వేశారు. ప్రాథ‌మిక రంగాలైన విద్య, వైద్యం, మౌలిక స‌దుపాయాల‌పై దృష్టి పెట్టారు. పారిశ్రామిక‌, వ్య‌వ‌సాయ‌, సేవ‌ల రంగాల అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు వేసి అమ‌లు చేశారు.

ఈనేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ ఏడాది పాల‌న‌పై బిజెపి నేత‌ల నుంచి త‌లోమాట వ‌స్తుంది. జాతీయ నేత‌లేమో జ‌గ‌న్ ఏడాది పాల‌న భేష్ అంటూ కితాబిస్తున్నారు. బిజెపి రాష్ట్ర నేత‌లేమో జ‌గ‌న్ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. బిజెపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ్ మాధ‌వ్ ఏపిని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ధృడ సంకల్పంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయ‌న‌ వైఎస్‌ జగన్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడక్కడా కొన్ని వివాదాలున్నా అవేం పెద్దవి కాదని అభిప్రాయపడ్డారు. అన్నిటికీ ముఖ్యమంత్రిని తప్పుబట్టడం సరికాదని విమర్శకులకు హితవు పలికారు.

దేవాదాయ ఆస్తుల విషయంలో సాధుసంతువుల కమిటీ ద్వారా.. నిర్ణయం తీసుకుంటామని సిఎం నిర్ణయించడం సంతోషకరమని రామ్‌మాధవ్ చెప్పుకొచ్చారు. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని మంచి నిర్ణయాలకు.. వైసిపి మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. పార్లమెంట్‌లో నిర్ణయాలకు వైసిపి నుంచి మంచి మద్దతు లభిస్తోందని తెలిపారు. ప్రధాని మోడీ, సిఎం వైఎస్‌ జగన్‌కు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒడిదుడుకులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఏపి ప్రజల అభివృద్ధి కోసం ప్రధాని మోడీ, సిఎం జగన్ కలిసి పనిచేస్తున్నారని తెలిపారు.

మ‌రోవైపు బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ, వైఎస్ జ‌గ‌న్ ఏడాది పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అనుభవ రాహిత్యం, అసమర్థ పాలన, కక్షసాధింపు, అహంకారం, ఆత్రం, అప్పులు, అవినీతి రివర్స్ పాలన, కోర్టు మొట్టికాయలు… ఏడాది పాలనంతా ఇలాగే సాగిందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు జగన్మోహ‌ రెడ్డికి ఏ మాత్రం లేదని, తక్షణమే సిఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2019లో ప్రజలు నమ్మి జగన్‌కు అవకాశం ఇస్తే.. ఇప్పుడు తన అసలు రూపం చూపిస్తున్నారని మండిపడ్డారు.

జగన్ ముఖ్యమంత్రయ్యి ఒక సంవత్సరం గడిచినా చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి మీద విచారణ చేయలేదని,శాసనమండలి రద్దు నిర్ణయం తొందరపాటు చర్య అని,నిమ్మగడ్డ రమేష్ విషయంలో హై కోర్టు తీర్పు తదితర అంశల మీద కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణ లు చేసాడు.

బిజెపి జాతీయ నేత‌లేమో జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌సంశ‌లు కురుపిస్తుంటే…రాష్ట్రంలోని బిజెపి నేత‌లేమో అందుకు భిన్నంగా విమ‌ర్శ‌లు కురుపిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు టిడిపి ఒక్క‌దానికే రెండు క‌ళ్లు సిద్ధాంతం ఉండేది. ఇప్పుడు బిజెపి కూడా రెండు క‌ళ్లు సిద్ధాంతం వ‌చ్చింది. జాతీయ నేతలు ప్ర‌సంశించిన రెండు రోజుల‌కే రాష్ట్ర నేత‌లు విమ‌ర్శించ‌డం ఏ పార్టీలో కూడా చూడ‌లేదు.