జగన్ మార్క్ పాలన: ప్రమాదం జరిగిన 24 గం.ల్లో పరిహారం

సంఘటన జరగడం సహజం. కానీ చక్కదిద్దడం, బాధితులను ఆదుకోవడం సర్కారు చేతుల్లో ఉంటుంది. వీలయినంత వేగంగా స్పందించి, నష్టపోయిన వారికి పరిహారం అందిస్తే కలిగే ఊరట అంతా ఇంతా కాదు. అందుకే ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ విషయంలో పగడ్బందీగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో అనేక సందర్భాల్లో నష్టపరిహారం ప్రకటించడం, దానికోసం కాళ్లరిగేలా బాధితులు తిరగడం చాలా మందికి తెలిసిందే. చివరకు పుష్కరాల సందర్భంలో నాటి ప్రభుత్వ పెద్దల నిర్వాహకంతో మూడు పదుల మంది ప్రాణాలు కోల్పోతే వారికి చెల్లించాల్సిన నష్టపరిహారం కోసం ఎంత జాప్యం జరిగిందన్నది చాలా మందిని విస్మయానికి గురిచేసింది. తామే తప్పు చేసి కూడా పరిహారం విషయంలో పట్టనట్టు వ్యవహరించడం నాటి సర్కారుకి చెల్లింది.

కానీ ఇప్పుడు ప్రభుత్వంలో అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన ఆరు గంటల్లోపే ముఖ్యమంత్రి అనూహ్యమైన నష్టపరిహారం ప్రకటించారు. దేశమంతా దానిపై చర్చ కూడా సాగింది. అది కూడా 3 రోజుల్లోపే బాధితులకు చేరింది. కేవలం మాటలతో సరిపెట్టకుండా చేతల్లో చూపించడం సీఎం జగన్ పాలనా విధానంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎల్జీ పాలిమర్స్ బాధితుల పరిహారం, పంపిణీ విషయంలో ప్రభుత్వ చొరవ అందరి ప్రశంసలు అందుకుంది.

కేవలం ఎల్జీ పాలిమర్స్ లో మాత్రమే కాకుండా సాధారణ ప్రమాదాల్లో కూడా అంతే వేగంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రత్యేకతగానే చెప్పవచ్చు. ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదం జరిగినప్పుడు అదే రీతిలో వ్యవహరించారు. తాజాగా కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద దైవదర్శనం కోసం వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో 13 మందికి పరిహారం ప్రకటించారు. ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల ను రికార్డ్ సమయంలో చెల్లించారు. అది కూడా ఏపీకి చెందిన బాధితులతో పాటు తెలంగాణా వాసులకు కూడా ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడం విశేషం. దానిని ఘటన జరిగిన 24 గంటల్లోనే జిల్లా కలెక్టర్, నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు చేతుల మీదుగా బాధితులకు అందించారు.

ప్రమాదాల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంతో సరిపెట్టుకుండా , అనుకోని ఘటనల్లో బాధితులకు అండగా ఉన్నామనే భరోసా కల్పించే ప్రయత్నం చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. జగన్ ప్రభుత్వ పాలనా తీరుకి ఇదో మచ్చుతునుకగా మారుతోంది. వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా అంతేవేగంగా అమలు చేయడం కూడా ఆషామాషీ వ్యవహారం కాదు. తాను అనుకున్నది క్షేత్రస్థాయిలో ఆచరణలో పెట్టేందుకు సీఎం చేసిన ప్రయత్నం కొంత ఫలితాన్నిస్తున్నట్టుగా ఇలాంటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా జగన్ మార్క్ పాలన యంత్రాంగాన్ని కొత్త పుంతలు తొక్కించేలా ఉందనే సంకేతాలు వస్తున్నాయి.

Show comments