iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్ తర్వాత జగన్, సెంటిమెంట్ ను తోసిపుచ్చిన సీఎం

  • Published May 09, 2020 | 3:58 AM Updated Updated May 09, 2020 | 3:58 AM
ఎన్టీఆర్ తర్వాత జగన్, సెంటిమెంట్ ను తోసిపుచ్చిన సీఎం

సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా సెంటిమెంట్ కి పెద్ద స్థాయిలో ప్రాధాన్యత ఉంటుంది. నాయకులు అలాంటి సెంటిమెంట్లను ఆచరించడం చాలాకాలంగా ఉంది. కానీ సెంటిమెంట్లను తోసిపుచ్చి, కొత్త చరిత్ర సృష్టించేలా ఇప్పటికే వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానం కనిపిస్తోంది. అనేక అంశాల్లో జగన్ గత చరిత్రను చెరిపేశారు. ఇప్పటి వరకూ ఏ మాజీ సీఎం తనయుడు చేయలేనిది, ఎన్టీఆర్ తర్వాత ఏ ప్రాంతీయ పార్టీ వల్ల కానిది, తొలిసారి ఓటమి తర్వాత నిలదొక్కుకోకవడం అనేది ఇలాంటి అనేక అంశాల్లో జగన్ ఏపీ రాజకీయాల్లో కొత్త చరిత్రకు పునాది వేశారు.

అలాంటి జగన్ తాజాగా విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రిలో అడుగుపెట్టి అలాంటి సెంటిమెంట్ ని మరోసారి చర్చనీయాంశం చేశారు. రాజకీయంగా సెంటిమెంట్లను చెరిపేసే నేతగా గుర్తింపు ఉన్న జగన్ ఈసారి ఉత్తరాంధ్రకు లో కీలకమైన కేజీహెచ్ లో అడుగుపెట్టడం ద్వారా అదే ఒరవడికి నాంది పలికినట్టు కనిపిస్తోంది. 1995 తర్వాత ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రి కూడా కేజీహెచ్ ఆసుపత్రిలో అడుగుపెట్టలేదు. ఎన్టీఆర్ తర్వాత నలుగురు సీఎంలు అధికారం చేపట్టినా ఎవరూ చేయని పనిని, 25 ఏళ్ల తర్వాత జగన్ చేయడం విశేషంగా కనిపిస్తోంది.

1994లో మూడోసారి సీఎంగా అధికారం చేపట్టిన ఎన్టీఆర్.. 1995లో ఉత్తరాంధ్రలో పజలను కలుసుకునేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రజా యాత్ర చేపట్టారు. అప్పట్లో సతీమణి లక్ష్మీపార్వతితో కలిసి ఉత్తరాంధ్రలో యాత్ర ప్రారంభించిన ఎన్టీఆర్ విశాఖ పర్యటనలో భాగంగా కింగ్ జార్జ్ ఆస్పత్రిలో రోగులను కలుసుకునేందుకు వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో అక్కడి సేవలను స్వయంగా పరిశీలించేందుకు ఎన్టీఆర్ కేజీహెచ్ లో అడుగుపెట్టారు. ఆ తర్వాత తన యాత్ర కొనసాగిస్తున్న క్రమంలోనే ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. ముఖ్యంగా నాటి తెలుగుదేశం పార్టీ పరిణామాలు చివరకు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచేందుకు దారితీశాయి. అప్పట్లో చంద్రబాబు అండ్ కో వ్యవహారం ఇప్పటికే చరిత్రలో రికార్డ్ అయి ఉంది. కానీ కేజీహెచ్ కి వచ్చి వెళ్లిన తర్వాత ఎన్టీఆర్ పదవి పోయిందనే ప్రచారం మాత్రం సాగింది.

దాంతో ఎన్టీఆర్ తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా నేరుగా కేజీహెచ్ కి వెళ్లిన దాఖలాలు లేవు. చివరకు హుద్ హుద్ వంటి సమయంలో కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు సైతం చంద్రబాబు సిద్ధపడలేదు. చివరకు 2018 మే నెలలో ఎంవీఎస్ మూర్తిని పరామర్శించేందుకు విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబు అనంతరం కేజీహెచ్ ని ఆకస్మిక తనిఖీలో భాగంగా పరిశీలిస్తారని మీడియకు కూడా సమాచారం ఇచ్చారు. చివరకు వైద్యులు కూడా అప్రమత్తమయ్యి, మొత్తం ఆసుపత్రిని సన్నద్ధం చేశారు. కానీ చివరకు ఆయన మనసు మార్చుకున్నారు. స్థానిక నేతలు కొందరు ఎన్టీఆర్ సెంటిమెంట్ ని ప్రస్తావించడంతో బాబు వెనకడుగు వేసినట్టు అప్పట్లో ప్రచారం సాగింది. పదవీగండం పొందనే భయంతో ఆయన తన కార్యక్రమం మార్చుకున్నట్టు కథనాలు కూడా వచ్చాయి.

కానీ జగన్ అలాంటి వాటిని తోసిపుచ్చారు. ఈనెల 7న ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో బాధితులను పరామర్శించేందుకు హుటాహుటీన బయలుదేరారు. ప్రమాద సమాచారం అందుకున్న గంటల వ్యవధిలోనే ఆయన బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అధికారులతో సమీక్షించారు. వైద్యులతో మాట్లాడారు.మెరుగైన చికిత్స అందించేందుకు తగిన సూచనలు చేశారు. తద్వారా కేజీహెచ్ సెంటిమెంట్ ని ఆయన తోసిరాజని ముందుకు సాగారు. చంద్రబాబు వెనకడుగు వేసిన చోట జగన్ ముందడుగు వేసి, నేరుగా బాధితులతో మాట్లాడి, చివరకు చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడి కాళ్లు పట్టుకున్న సీఎం తీరు అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది.

ఇప్పటికే ఎన్టీఆర్ తర్వాత ఏపీలో ప్రాంతీయ పార్టీని విజయతీరాలకు చేర్చిన ఘనుడిగా జగన్ చరిత్రపుటలకెక్కారు. కేజీహెచ్ ఉదంతం ద్వారా సెంటిమెంట్ పేరుతో సామాన్యుల చెంతకు వెళ్లేందుకు వెనకాడే నేత కాదని నిరూపించుకున్నారు. ప్రజల సమస్యల్లో తాను తోడుగా ఉండడమే బాధ్యతగా భావించిన ముఖ్యమంత్రిగా విశాఖ వాసుల మనసు గెలుచుకునే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. తద్వారా జగన్ వ్యవహారశైలి అందరికన్నా భిన్నంగా ఉంటుందనే విషయం నిరూపించుకున్నారు.