iDreamPost
iDreamPost
ఏపీలో శాసనమండలి చర్చనీయాంశం అవుతూనే ఉంది. ఇప్పటికే కీలక బిల్లుల విషయంలో కొర్రీలు వేసి చివరకు మండలి రద్దు వరకూ రావడానికి అక్కడి పరిణామాలు కారణం అయ్యాయి. అయితే రాష్ట్ర స్థాయిలో మండలికి సంబంధించిన ముగింపు ప్రక్రియ పూర్తయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉన్న వ్యవహారం ఎప్పటికి కొలిక్కి వస్తుందోననే క్లారిటీ ఇంకా రాలేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత సందర్భంగా మండలి రద్దు తీర్మానం ఆమోదించే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవల మోడీ, అమిత్ షా తో జరిగిన భేటీలో జగన్ కి దానికి సంబంధించిన సానుకూల సంకేతాలు వచ్చాయనే వాదనలున్నాయి.
అయినప్పటికీ ఈసారి బడ్జెట్ సమావేశాల సందర్భంగా మండలి వ్యవహారం మరోసారి ముందుకు రాబోతున్నట్టు కనిపిస్తోంది. మార్చి రెండోవారంలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలి కూడా సమావేశం జరపాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం పలు ఆలోచనలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే చైర్మన్ తీసుకున్న సెలక్ట్ కమిటీ నిర్ణయం సందిగ్ధంలో పడింది. గవర్నర్ కి నేరుగా చైర్మన్ మొరపెట్టుకున్నా మండలి కార్యదర్శి మాత్రం ముందుకు జరపలేదు. దాంతో సెలక్ట్ కమిటీ వ్యవహారం ప్రభుత్వం వాదిస్తున్నట్టుగా 14 రోజుల నిబంధనల ప్రకారం కొండెక్కినట్టేననే అభిప్రాయం బలపడుతోంది.
అందుకు తోడుగా బడ్జెట్ కోసం మండలి సమావేశాలు జరపాల్సి వస్తే చైర్మన్ పై అవిశ్వాసానికి వైఎస్సార్సీపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆపార్టీకి చెందిన సభ్యులతో పాటు టీడీపీకి చెందిన మరో 10 మంది సభ్యులు దానికి సానుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు. నలుగురు టీడీపీ ఎమ్మెల్సీలు ఇప్పటికే జగన్ కి జై కొట్టారు. వారికి తోడుగా ఇంకా కొందరు కలిసి వస్తే చైర్మన్ షరీఫ్ చెయిర్ కిందకు నీళ్లు రావడం ఖాయం. దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రభుత్వ పక్షం తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఆయనపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అదే జరిగితే శాసనమండలి పరిణామాలు మరోసారి వేడెక్కే అవకాశం ఉంది.