iDreamPost
android-app
ios-app

వంగవీటి రాధ ఏ నియోజకవర్గానికి ఇంచార్జ్ గా వెళుతున్నాడు?

వంగవీటి రాధ ఏ నియోజకవర్గానికి ఇంచార్జ్ గా వెళుతున్నాడు?

వంగవీటి మోహన రంగా చనిపోయి 32 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆపేరు ఒక సంచలనం. రాజకీయంగా, సామాజిక వర్గ పరంగా రంగాకు ఉన్న చరిష్మా అలాంటిది. అయితే రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో ఇప్పటికీ తన ముద్రవేయలేకపోయాడు .

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2004లో విజయవాడ ఈస్ట్ కాంగ్రెస్ తరపున రాధా పోటీచేసి గెలిచారు. పార్టీలో రంగా వారసుడిగా రాధాకు వైస్సార్ వద్ద మంచి ప్రాముఖ్యత ఉండేది. అయినా కాంగ్రెస్ ను కాదని 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో కాంగ్రెస్‌ పార్టీని వీడి పీఆర్పీలో చేరారు. విజయవాడ సెంట్రల్ నుంచి పీఆర్సీ తరపున పోటీచేసి ఓడిపోయారు. అనంతరం పీఆర్పీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయడంతో రాధా రాజకీయ భవిష్యత్తుపై సందిగ్థత ఏర్పడింది. అనంతరం జరిగిన రాష్ట్ర విభజన పరిణామాలతో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైపోయింది.

దాంతో వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడంతో రాధా వైసీపీలో చేరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతలు చూస్తూ వచ్చారు. 2014లో టికెట్ పై విజయవాడ సెంట్రల్ నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. రాజకీయాల్లో అంతగా క్రియాశీలకంగా ఉండేవారు కాదు. అయితే 2019 ఎన్నికలకు ముందు రాధకు, జగన్‌కు మధ్య కాగ్యాప్ వచ్చింది. రాధాకు టికెట్ ఇస్తే సెంట్రల్ సీటు కోల్పోతామని పలు సర్వేలు రావడం, రాధాకు విషయం చెప్పినా మరింత యాక్టివ్ కాలేకపోవడం వంటి కారణాలతో రాధాను సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించారు. అనంతరం మచిలీపట్నం పార్లమెంట్ కు వెళ్లాలని అక్కడినుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమని పార్టీ పెద్దలతో జగన్ చెప్పించారు. పార్టీ సపోర్ట్ తోపాటు ఆర్ధికంగా అన్నివిధాలుగా మచిలీపట్నం పార్లమెంట్ సీటు బావుంటుందని, గెలుపు బాధ్యత మాదేనని జిల్లా పార్టీ నేతలు చెప్పినా రాధా వినిపించుకోలేదు.

తనను సెంట్రల్ నుండి తప్పించి మల్లాది విష్ణుకు పగ్గాలు అందించడంతో ఈ వంగవీటి వారసుడు పర్సనల్ గా పగతో రగిలిపోయాడు. ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్ పై విమర్శలు గుప్పించాడు. పలు వ్యక్తిగత కామెంట్లు చేస్తూనే వైసీపీకి గుడ్ బై చెప్పాడు. దాంతో అందరూ రాధా జనసేనలో చేరాతారని భావించారు. జనసేన నుంచి ఆహ్వానం అందినా ఆపార్టీలోకి వెళ్లలేదు. గతంలో తన తండ్రిని చంపించింది టీడీపీనే అంటూ విమర్శలు చేసిన రాధ ఆ పార్టీలో చేరడంపై తీవ్రవిమర్శలు వినిపించాయి.

ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన రాధాకు టీడీపీ అసలు ఎన్నికల్లో పోటీచేసే అవకాశమే ఇవ్వలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాధాకు సుముచిత పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేసే బాధ్యతలను రాధకు అప్పగించారు. అయితే టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఎప్పుడైతే రాధా టీడీపీ కండువా కప్పుకున్నారో ఆయన వెంట ఉండే చాలామంది కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు దూరమయ్యారు. రాధారంగా మిత్రమండలి కూడా టీడీపీలో చేరికను తీవ్రంగా వ్యతిరేకించిందది. గతంలో రంగా వెంట నడిచిన చాలామంది ఇప్పుడు రాధాను పలకరించడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇదే సమయంలో కొద్దిరోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సమావేశమై రాధా రెండుసార్లు చర్చలు జరిపారు. దాంతో ఆయన జనసేనలో చేరతారని అంతా భావించినా రాధామాత్రం జనసేనలో చేరే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వ్యక్తిగతంగానే పవన్ కళ్యాణ్ ని కలిసానని చెప్తూ ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు.

ఈ నేపధ్యంలో రాధాను గుంటూరు జిల్లా సత్తెనపల్లికి తెలుగుదేశం పార్టీకి ఇన్ చార్జ్ గా నియమించబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పార్టీ నేతలతో ఈ విషయాన్ని చర్చించారని రాధా పేరు దాదాపు ఖరారు చేశారనే టాక్ వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుండటంతో చంద్రబాబు ఈనిర్ణయం తీసుకున్నారట.. సత్తెనపల్లికి కోడెల తర్వాత ఇంఛార్జ్ ఎవరూ లేరు. కోడెల మరణం తర్వాత అక్కడి కేడర్ మొత్తం గందరగోళంలో ఉంది.

రాధాను సత్తెనపల్లికి పంపడం వెనుక సామాజిక సమీకరణాలు ఉన్నాయట.. ఇక్కడ దాదాపుగా 30 వేల వరకు కాపు సామాజిక వర్గ ఓట్లు ఉండడంతో రాధాను అక్కడికి పంపిస్తే బావుంటుందనేది చంద్రబాబు అభిప్రాయమట.. కోడెల శివప్రసాద్ లాంటి బలమైన నాయకుడిని మొన్నటి ఎన్నికల్లో అంబటి రాంబాబు ఓడించటంలో ఆయన సామాజిక వర్గ బలం కలిసొచ్చిందని చంద్రబాబు భావిస్తున్నట్లున్నారు. 2014 ఎన్నికల్లో కూడా అంబటి రాంబాబు మీద కోడెల కేవలం వెయ్యి ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలవటం గమనార్హం.

ఇటీవల గుడివాడ, బాపట్ల, ఏలూరు, మాచర్ల నియోజకవర్గాలకు ఇంఛార్జ్ లను నియమించారు. ఈ క్రమంలో సత్తెనపల్లిలో రాధా మళ్లీ యాక్టివ్ కాబోతున్నారు. రాధాకు కూడా సత్తెనపల్లి వెళ్లడానికి సుముఖంగా ఉన్నారట.. ఎన్నికలు అయిపోయిన తర్వాత స్తబ్ధుగా ఉన్న రాధా ఇటీవల అమరావతి ఉద్యమంలోనూ తరచుగా పాల్గొంటున్నారు.

అయితే రాధా రాజకీయ భవిషత్తు గురించి ఆయన అనుచరులు, రంగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో విజయవాడను వదిలి మచిలీపట్నం వెళ్లి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని, ఇప్పుడు ఏకంగా జిల్లానే వదిలి వెళ్తున్నాడంటూ ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. గతంలో దేవినేని అవినాష్ చంద్రబాబు మాట విని విజయవాడను వదిలి గుడివాడ వెళ్లి ఎలా పరాభవం పొందాడో అందరికీ తెలిసిందే.. నిలకడ లేని నిర్ణయాల వల్ల రాజకీయ భవిష్యత్తు నాశనం చేసుకుని, ప్రాణాలిచ్చే అనుచరులను దూరం చేసుకుని, వంగవీటి అనే బ్రాండ్ పేరును కనీసం నిలబెట్టలేక రంగా వారసుడి పరిస్థితి ఇబ్బందికరంగా ఉందనేది విజయవాడలో టాక్.

రాధా వైసీపీలో కొనసాగి ఉండి ఉంటే బావుండేదని ఎంపీగానో, ఎమ్మెల్యేగానో.. ఓడిపోతే ఏదైనా పిల్లి సుభాష్,మోపిదేవి వెంకట రమణల లాగా మంచి పదవైనా దక్కేదనే చర్చ జరుగుతోంది. టీడీపీలో చేరి రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకున్నారనే అభిప్రాయం కలుగుతోంది. రాధా పొలిటికల్ ఫ్యూచర్ టీడీపీలోకి వెళ్లిననాడే ముగిసిపోయిందంటున్నారు రాజకీయ పరిశీలకులు .